న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : యాపిల్ ఐఫోన్ 17ను ఎగబడి కొనేస్తున్నారంతా. దేశీయంగా శుక్రవారమే ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో ప్రధాన నగరాల్లో ఈ నయా మొబైల్ కోసం ఐఫోన్ ప్రేమికులు పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు. గంటల తరబడి నిల్చునైనా మొబైల్‌ను కొనేదాకా ఎవరూ తగ్గలేదు. చాలామంది స్టోర్లు తెరవకముందే పడిగాపులు కాయటం గమనార్హం. ఢిల్లీ సాకెట్ సిటీవాక్ మాల్, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్, బెంగళూరు యాపిల్ హెబ్బల్ స్టోర్లలో ఎక్కడా చూసినా ఇదే పరిస్థితి.
మునుపెన్నడూ యాపిల్ ఐఫోన్లకు ఈ స్థాయి స్పందన చూడలేదని రిటైలర్లు చెప్తున్నారు. ‘ఉదయం నుంచి నేను క్యూలైన్లోనే ఉన్నాను. కాస్మిక్ ఆరెంజ్ రంగులో ఐఫోన్ 17ను కొనేందుకు ఎంతో ఆత్రుతతో వేచిచూస్తున్నాను’ అని ఢిల్లీ సంగం విహార్‌కు చెందిన అష్రాఫ్ తెలిపారు. కాగా, దేశీయ మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ధరల శ్రేణి రూ.82,900-రూ.2,29,900గా ఉన్నది. కొత్త ఐఫోన్లతోపాటు మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచీలు, ఎయిర్పాడ్స్నూ యాపిల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.