చాలామంది వృద్ధాప్యంలో తమ అవసరాల కోసం పిల్లల మీదే ఆధారపడతారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు రిటైర్మెంట్ కోసం సేవింగ్స్నూ ప్లాన్ చేసుకుంటున్నారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలనేది నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా సేవింగ్స్ విధానం, స్వావలంబన-పిల్లలు, ఎంత ఆదా చేయాలి?, ఎప్పుడు ప్రారంభించాలి?, పెట్టుబడులు-ఉపసంహరణలు అంశాలపై అంతా దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.
నిజానికి పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో ఇప్పటికీ తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా వారి సంతానంపైనే ఉంటున్నది. ఇటీవలి ఓ సర్వేలోనూ ఇదే తేటతెల్లమైంది. కాగా, ఉద్యోగం ఆరంభం నుంచే రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం పెట్టుబడులు, పొదుపు చేయాలని మెజారిటీ నిపుణులు చెప్తున్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకూ తగినంత ప్రాధాన్యం ఇవ్వాలని, తొలినాళ్లలో ప్రారంభిస్తే తక్కువ ప్రీమియంలతో ఎక్కువ ప్రయోజనాలు అందుకోవచ్చని అంటున్నారు.