Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు మరింత పడిపోయాయి. గత నెల 26తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 561 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఫారెక్స్ నిల్వల్లో మెజారిటీ వాటా గల విదేశీ కరెన్సీ ఆస్తులు పడిపోవడం దీనికి కారణం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా ఫారెక్స్ నిల్వలు పడిపోవడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం పడుతుందన్న భయాల మధ్య ఫారెక్స్ నిల్వలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని భావిస్తున్నారు.
గత నెల 26తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 561.046 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయని ఆర్బీఐ డేటా తెలిపింది. ఇంతకుముందు వారంతో పోలిస్తే 3.007 బిలియన్ల డాలర్లు పడిపోయాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 2.571 బిలియన్లు పడిపోయి 498.645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మరోవైపు, బంగారం నిల్వలు 271 మిలియన్ డాలర్లు పతనమై 39.643 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్‌డీఆర్‌లు సైతం 155 మిలియన్ డాలర్ల పతనంతో 17.832 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ఐఎంఎఫ్‌లో రిజర్వు నిల్వలు 10 మిలియన్ల డాలర్లు తగ్గి 4.926 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గత నెలలో దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.51,200 కోట్ల నిధులు పెట్టుబడిగా పెట్టారు. గత 20 నెలల్లో ఇది గరిష్ఠం. ఎఫ్ఐఐలు గత జూన్,మే నెలల్లో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.58,112.37 కోట్లు, రూ.54,292.47 కోట్లు ఉపసంహరించారు.