Credit Score | ప్రస్తుతం అనేకమంది భారతీయ విద్యార్థులకు విద్యా రుణం పొందడమే వారి విద్యాభ్యాస విజయానికి కీలకంగా మారింది. ఇట్టే విద్యా రుణాలను పొందవచ్చని చెప్తున్నా ఇప్పటికీ సరైన క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర లేకపోతే ఎదురయ్యే సవాళ్లు అన్నీఇన్నీ కావుమరి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ విద్యా రుణాన్ని పొందడానికి కొన్ని దారులున్నాయన్నది మరువద్దు. క్రెడిట్ స్కోర్ లేకున్నాదరఖాస్తుదారులు విద్యా రుణాన్ని పొందడానికున్న ఆ మార్గాలేంటో చూద్దాం.
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. నైపుణ్య లేదా సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో అర్హత ఉన్నవారందరికీ విద్యా రుణాలపై వడ్డీ రాయితీ, మారటోరియం సౌకర్యాలను సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్) స్కీం కల్పిస్తున్నది. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలలోపున్న విద్యార్థులకే ఈ స్కీం వర్తిస్తుంది. అలాగే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) ద్వారా రుణ చరిత్ర లేని విద్యార్థులకు క్రెడిట్ గ్యారంటీలు, తనఖా లేని రుణాలను సులువుగా అందిస్తున్నారు. అయితే మాడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీముల కిందనున్న రుణాలకు మాత్రమే సీజీఎఫ్ఎస్ఈఎల్ వర్తిస్తుంది. చదువుకునేటప్పుడు విద్యార్థులు సంపాదించే వీలుండదు. అందుకే అలాంటి విద్యార్థులనుద్దేశించే ఈ పథకాలకు రూపకల్పన చేశారు. అయితే చదువు ముగిసిన తర్వాత ఇచ్చిన గడువులోగా రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీములకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
సాధారణంగా రుణాలిచ్చే బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు ఆ రుణాలు తిరిగి సజావుగా వసూలు కావాలనే ఎప్పుడూ కోరుకుంటాయి. అందుకే తనఖాపై లేదా బలమైన రుణ పరపతి కలిగినవారి పూచీకత్తుపై రుణాలిచ్చేందుకే రుణదాతలంతా ప్రాధాన్యతనిస్తారు. తద్వారా తమకు నష్టం రాకుండా జాగ్రత్తపడుతాయి. ఉదాహరణకు ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సెక్యూరిటీలు, ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి తాకట్టు పెట్టుకొని ఆకర్షణీయ వడ్డీరేట్లకు లోన్లను మంజూరు చేస్తున్నాయి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్నుబట్టి కూడా రుణాలను మంజూరు చేస్తున్నాయి.
విద్యా రుణానికి వెళ్లే ముందు రకరకాల బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను సంప్రదించడం ఉత్తమం. రుణాలపై వడ్డీరేట్లు సంస్థనుబట్టి మారుతుంటాయి మరి. ఉదాహరణకు సెక్యూరిటీ లేకుండా ఎస్బీఐ రూ.7.5 లక్షలదాకా విద్యా రుణాలపై 10.65 శాతం వడ్డీరేటును వసూలు చేస్తున్నది. ఆపై విద్యా రుణాలకు సెక్యూరిటీపై 9.65 శాతం వడ్డీరేటునే వర్తింపజేస్తున్నది. అయితే విద్యార్థినులకు ఈ వడ్డీరేట్లపై 0.50 శాతం రాయితీని అందిస్తున్నది. అలాగే మరికొన్ని బ్యాంకుల్లో నిబంధనలకు లోబడి ఇంకా తక్కువ వడ్డీరేట్లకే విద్యా రుణాలను పొందవచ్చు.