న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ స్టాక్ మార్కెట్లను చూసి ఫండ్ మేనేజర్లు బెంబేలెత్తిపోతున్నారు. తీవ్ర ఒడిదుడుకులతో మదుపర్లు ఆందోళనలోపడ్డారు మరి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. గత 6 నెలలుగా స్థిరత్వం లోపించడంతో కొత్త పెట్టుబడులకు జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ నిర్వహించిన ఫండ్ మేనేజర్ల తాజా సర్వేలోనూ ఇదే తేలింది. ఆసియా దేశాల్లో ఇప్పుడు మదుపర్లకు అత్యల్ప ప్రాధాన్యత కలిగిన ఈక్విటీ మార్కెట్లు భారత్‌వేనని ఇందులో తేలడం గమనార్హం.
ఈ నెల 7-13 మధ్య జరిగిన ఈ సర్వేలో మొత్తం 98 మంది ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, బ్లూమ్‌బర్గ్ వివరాల ప్రకారం.. వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో 272 బిలియన్ డాలర్ల ఆస్తులను వీరు నిర్వహిస్తున్నారు. ఇక ఆయా ప్రశ్నలకు వీరిచ్చిన సమాధానాల ఆధారంగానే సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే పెట్టుబడులకు సంబంధించి మదుపర్లకున్న ప్రాధాన్యంలో ఇండోనేషియా కంటే దిగువన మైనస్ 32 శాతంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నిలిచాయి.
2025దాకా వరుసగా 10 ఏండ్లపాటు మదుపర్లకు లాభాలను పంచిన భారతీయ స్టాక్ మార్కెట్లు.. ఈ ఏడాది మాత్రం ఆ ఉత్సాహాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. ఇటీవలికాలంలో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను అందిపుచ్చుకోవడంలో జరుగుతున్న జాప్యం సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్టు చెప్తున్నారు. సెమీకండక్టర్, మెమరీ, ఇతర టెక్నాలజీల షేర్ల మద్దతుతో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లలో సుమారు 60 శాతం ర్యాలీ కనిపిస్తున్నదంటే.. ఏఐపట్ల ఇన్వెస్టర్లలో ఏ స్థాయిలో ఆసక్తి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ భారత్‌లో ఈ రకమైన వాతావరణం లేకపోవడం ప్రతికూలంగా మారుతున్నదంటున్నారు. ఇది సంస్కరణల అమలులో కేంద్ర ప్రభుత్వం అలసత్వాన్ని కూడా ఎత్తిచూపుతున్నది. ఫలితంగా ఆసియాలో నాల్గో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఈ తరహా పాలన సరికాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయిప్పుడు.
ఇక భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తకర పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, బాండ్ మార్కెట్లో ఆకర్షణీయ రాబడులు కూడా స్టాక్ మార్కెట్లను మదుపర్లకు దూరం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు సైతం భారత్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ముగింపుతో చూస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా సెన్సెక్స్ 7,682.88 పాయింట్లు, నిఫ్టీ 1,897.75 పాయింట్లు పడిపోయాయి. జనవరిలో నిఫ్టీ ఆల్‌టైమ్ హై రికార్డులకు చేరినా నిలుపుకోలేకపోయింది.
