న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు మందగమనంలోకి జారుకుంటున్నదని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధి 6.8 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) 7.6 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో ఇంధన, ఆహార ద్రవ్యోల్బణం ముప్పు ఉందంటున్న ఇండియా రేటింగ్స్.. డాలర్‌తో పోల్చితే బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ, ఎల్ నినో కారణంగా తగ్గిన వర్షపాతం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తుండటం కూడా దేశ జీడీపీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నది.
ఈ ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు సగటున 85 డాలర్లు పలుకవచ్చని ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ అంచనా వేసింది. అలాగే ఫారిన్ ఎక్సేంజ్‌లో రూపాయి మారకం విలువ సగటున రూ.93.98గా ఉండొచ్చని ఈ ఫిచ్ గ్రూప్ అనుబంధ సంస్థ అంటున్నది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిని అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాకు అండగా ఉంటున్నాయని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమన్‌లపై ఇరాన్ దాడులు చేస్తున్నది మరి. మరోవైపు కీలకమైన హొర్ముజ్ జలసంధిలోనూ సరుకు రవాణాను అడ్డుకుంటున్నది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చేది ఎక్కువే కావడంతో వార్ సెగ భారత్‌కు గట్టిగానే తగులుతున్నది.
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ అంచనాను వేసిన ఇండియా రేటింగ్స్.. త్రైమాసికాల వారీగా కూడా ప్రకటించింది. తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లో 6.9 శాతంగా, రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్‌లో 6.6 శాతంగా, మూడో త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 6.7 శాతంగా, నాల్గో త్రైమాసికం జనవరి-మార్చిలో 6.9 శాతంగా ఉండొచ్చన్నది. కాగా, ఆర్బీఐ ఇటీవల ఈ త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు వరుసగా 7, 6.4, 6.5, 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే ముడి చమురు ధరలు సగటున ఏప్రిల్-జూన్‌లో బ్యారెల్ 101.31 డాలర్లుగా నమోదయ్యాయని, ఏప్రిల్-జూలైలో 96.49 డాలర్లుగా ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ తెలిపారు. అయితే చమురు ధరలు తగ్గుముఖం పడితే దేశ వాణిజ్య, కరెంట్ ఖాతా లోటు దిగొస్తుందని ఆయన గుర్తుచేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.9 శాతంగా ఉండొచ్చని, కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.5 శాతానికి పెరుగవచ్చని అన్నారు.