ముంబై, అక్టోబర్ 2: విదేశీ మారకం నిల్వలు భారీగా కరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ మారకం నిల్వలు అంతే వేగంతో పతనం చెందాయి. సెప్టెంబర్ 25తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 19.34 బిలియన్ డాలర్లు తగ్గి 747.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వు బ్యాంక్ వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 14.881 బిలియన్ డాలర్తు గ్గి 765.901 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 4తో ముగిసిన వారాంతానికిగాను రికార్డు స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 15.75 బిలియన్ డాలర్లు తరిగిపోయి 615.411 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. డాలరేతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ భారీగా తగ్గిందని తన నివేదికలో పేర్కొంది.
అలాగే బంగారం రిజర్వులు కూడా 2.591 బిలియన్ డాలర్లు తగ్గి 108.701 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా 97 మిలియన్ డాలర్లు తగ్గి 18.642 బిలియన్ డాలర్లకు చేరుకోగా..ఐఎంఎఫ్ వద్ద విదేశీ నిల్వలు 86 మిలియన్ డాలర్లు తగ్గి 4.804 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు తెలిపింది.