డ్రీమ్ హౌజ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశాలు చాలా ఎక్కువ. గృహ రుణాల మీద ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీ ఉన్నదిప్పుడు. అయితే సొంతింటి కల సాకారం కావాలంటే ఒక్కోసారి అర్హతలే అడ్డంకి కావచ్చు. అందుకని హోమ్ లోన్‌కు వెళ్లడానికి ముందుగానే అర్హతలను పెంచుకునేది ఎలాగో చూద్దాం.
సిబిల్ స్కోర్
ఎంత చిన్న రుణానికైనా సిబిల్ స్కోరే.. మీ పరపతిని, అర్హతను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న రుణాల చెల్లింపులు సవ్యంగా జరిగేలా చూసుకోవాలి. సాధ్యమైనంత తక్కువ రుణాలుండేలా జాగ్రత్తపడాలి. పదేపదే అప్పుల కోసం ప్రయత్నించకండి. బ్యాంకుల్లో చెక్కు బౌన్స్ అవడం, ఖాతాల్లో కనీస మొత్తాలు లేకపోవడాలు వంటివి క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. అలాగే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయుఆర్) అనేది కూడా కీలకం. సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండాలని చెబుతున్నా.. 800లకుపైగా ఉంటేనే హోమ్ లోన్ మంజూరే కాదు. వడ్డీరేటు కూడా తక్కువకే వస్తుంది.
జాయింట్ హోమ్ లోన్
భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే.. కలిసి గృహ రుణం తీసుకోండి. దీనివల్ల రుణ అర్హత పెరుగుతుంది. అలాగే రీపేమెంట్ భారం కూడా తక్కువే. ఎందుకంటే పన్ను ప్రయోజనాలు ఇద్దరికీ వర్తిస్తాయి. భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులతో కూడా కలిసి జాయింట్ లోన్‌ను తీసుకోవచ్చు.
రుణ భారం తగ్గించుకోండి
హోమ్ లోన్ తీసుకునే ముందే అప్పటికే ఉన్న ఇతర చిన్నచిన్న రుణాలను తీర్చేయండి. దానివల్ల ఎక్కువ రుణానికి అర్హతను సాధించవచ్చు. దీనికితోడు సీయూఆర్ కూడా తగ్గుతుంది. మనకొచ్చే ఆదాయానికి, ఉన్న రుణాలకు మధ్య నిష్పత్తే చాలా కీలకం. దీన్ని పెంచుకోవాలంటే అసలు రుణాలే లేకపోవడం మంచిది. మన ఆదాయంలో 40 శాతం కన్నా తక్కువే రుణాల చెల్లింపులకు అయ్యే వ్యయంగా ఉండాలి. మొత్తం ఆదాయంలో 60 శాతం ప్రామాణికంగానే రుణాల జారీ ఉంటుంది.
అదనపు ఆదాయాలు, డౌన్ పేమెంట్
ఈ రెండు అంశాలూ హోమ్ లోన్ అర్హతను పెంచేవే. 100 శాతం రుణం లభిస్తున్నప్పటికీ ఎంత డౌన్ పేమెంట్ చేస్తామనే దానిపైన కూడా గృహ రుణం అర్హత ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా డౌన్ పేమెంట్ చేయగలిగితే అంత ఉత్తమం. ఈ అదనపు ఆదాయాలను ఐటీఆర్‌లో పేర్కొంటే అది మరింత అదనపు అర్హతనిస్తుంది.
పరిశీలన తర్వాతే..
హౌజింగ్ లోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట వివిధ కంపెనీల వడ్డీ రేట్లు, నియమాలను అధ్యయనం చేయండి. ఇవి తెలుసుకోకుండా అన్ని కంపెనీలకు ముందుగా దరఖాస్తు చేస్తే కూడా క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బందే. ఆదాయ వ్యయాలను, సిబిల్ స్కోర్‌ను, అర్హతలను, వడ్డీ రేట్లను పోల్చడం, డాక్యుమెంటేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు తదితర అంశాలన్నింటినీ ముందుగానే పరిశీలించడం లాభదాయకం. మనకు అనుకూలంగా ఏ సంస్థ రుణాలు ఉంటే అక్కడే రుణానికి దరఖాస్తు చేయండి.