ICICI Bank Q3 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘ఐసీఐసీఐ బ్యాంక్’ 23.6 శాతం నికర లాభం గడించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం రూ.10,272 కోట్లుగా నిలిచింది. మార్కెట్ వర్గాలు రూ.9,981 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ 13.4 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2022-23 సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో రూ.16,465 కోట్ల నికర వడ్డీ ఆదాయం గడిస్తే, ఈ ఏడాది రూ.18,678 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ, నికర వడ్డీ మార్జిన్లు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 2022-23 సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 4.65 శాతమైతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 4.53 శాతంగా నమోదైంది.
డిసెంబర్ నెలాఖరు నాటికి బ్యాంకులో డిపాజిట్లు 18.7 శాతం పెరిగి రూ.13,32,315 కోట్లకు చేరాయి. దేశీయ రుణాల పోర్ట్ ఫోలియో సైతం 18.8 శాతం పెరిగి రూ.11,14,820 కోట్లకు చేరుకున్నది. నికర మొండి బకాయిలు (ఎన్పీఏ) స్వల్పంగా పెరిగాయి. 2022-23తో పోలిస్తే 0.43 శాతం నుంచి 0.44 శాతానికి పెరిగాయి. స్థూల మొండి బకాయిలు రూ.1,389 కోట్లుగా నమోదయ్యాయి.