కార్ల ధరలకు రెక్కలు.. వరుసగా ధరలు పెంచుతున్న ఆటోమొబైల్ సంస్థలు
నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలుచేయాలనుకునేవారికి షాకివ్వబోతున్నాయి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహన ధరలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి మరో మూడు సంస్థలు చేరాయి.
- తాజాగా హ్యుందాయ్, ఆడీ, టాటా మోటర్స్ కూడా..
న్యూఢిల్లీ, నవంబర్ 24 : నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలుచేయాలనుకునేవారికి షాకివ్వబోతున్నాయి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహన ధరలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి మరో మూడు సంస్థలు చేరాయి. వీటిలో దేశీయ కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్తోపాటు టాటా మోటర్స్, ఆడీ కూడా ఉన్నది. ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా తమ ధరల పెంపునకు ప్రధాన కారణాలని ఆటోమొబైల్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఉక్కు, అల్యుమినియం ధరలతోపాటు ఇంధన ధరలు కూడా అధికం కావడంతో సంస్థలపై అదనపు భారం పడుతున్నది. ఈ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలు వాహన ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. ఒక ఆటోమొబైల్ కంపెనీ మొత్తం వ్యయాల్లో కమోడిటీ వ్యయాల వాటా దాదాపు 60-65 శాతం ఉంటుందని అంచనా. ప్రపంచ నౌకా రవాణా చార్జీల సూచిక అయిన బాల్టిక్ డ్రై ఇండెక్స్ గతేడాదితో పోలిస్తే పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2,124 పాయింట్లుగా ఉన్న ఈ సూచిక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3,408 పాయింట్లకు చేరింది
8 వేలు పెరగనున్న హ్యుందాయ్ కార్లు
హ్యుందాయ్ సంస్థ కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.8 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా మాడళ్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని హ్యుందాయ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్గత సామర్థ్యాలు, వ్యయ నియంత్రణ చర్యలతో పెరుగుతున్న ఖర్చుల్లో గణనీయమైన భాగాన్ని కంపెనీ ఇప్పటివరకు భరిస్తూ వచ్చిందని, కానీ అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ధరల పెంపు అనివార్యమైందని పేర్కొంది. ఇప్పటికే సంస్థ ఈ ఏడాది మూడుసార్లు.. జనవరి, జూన్, సెప్టెంబర్‌లోనూ ధరలు పెంచింది.
టాటా మోటార్స్ ఈవీలు ప్రియం..
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మంగళవారం తన మొత్తం వాహన శ్రేణి ధరలను 0.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరణ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నది. అంతర్గత దహన ఇంజిన్ వాహనాల శ్రేణి, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ ఈ పెంపు వర్తిస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తెలిపింది. మాడళ్లు, వేరియంట్లను బట్టి పెంపు మారుతుందని పేర్కొంది. ఇన్పుట్ వ్యయాలు నిరంతరం పెరగడమే ధరల సవరణకు కారణమని కంపెనీ తెలిపింది.
ఆడీ వాహనాలు కూడా..
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..భారత్‌లోని తన మాడళ్ల ఎక్స్‌షోరూం ధరలను 2027 జనవరి 1 నుంచి గరిష్ఠంగా 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాలను భర్తీ చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2026లో ఆడీ ఇండియాకు ఇది రెండో ధరల సవరణ. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను గరిష్ఠంగా 2 శాతం పెంచింది. ఈ ధరల సవరణ తమ మొత్తం మాడళ్లకు వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల నేపథ్యంలో ధరలను గరిష్ఠంగా 2 శాతం సవరించనున్నాం. మా వ్యాపార దీర్ఘకాలిక స్థిరత్వానికి ఈ సవరణ అవసరం. పెంపును సాధ్యమైనంత మితంగానే ఉంచాం. బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని బలోపేతం చేసే యాజమాన్య అనుభవాన్ని అందించడంపైనే మా దృష్టి ఉంటుందని ఆడీ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఏ4, ఏ6 సెడాన్లు, క్యూ3, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్క్యూ8, ఆర్ఎస్క్యూ8 మాడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

