హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): గిడ్డంగుల లీజింగ్లోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్లో 54 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. అంతక్రితం ఏడాది తీసుకున్న లీజుతో పోలిస్తే 128 శాతం వృద్ధి నమోదైందని ‘ఇండియా వేర్ హౌజింగ్ మార్కెట్ రిపోర్ట్-2022’ నివేదికలో పేర్కొంది.
దేశంలోని 8 మెట్రోనగరాల్లో వృద్ధి పరంగా రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచిందన్నది. పుణె 166 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఇతర నగరాలతో పోలిస్తే ఈ రెండు నగరాలు చాలా గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేశాయి.