హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ) వ్యాపార సంస్థ బిల్ట్రస్ట్ కూడా చేరింది. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్‌లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడి అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన బిల్ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనతికాలంలోనే హైదరాబాద్ జీసీసీలకు హబ్‌గా మారిందని, గతేడాది 75కుపైగా కొత్త జీసీసీలు ఇకడ ప్రారంభమయ్యాయని వివరించారు. గ్లోబల్ ఆపరేషన్స్, టెక్నాలజీ, ఆర్అండ్డీ విభాగాల అనుసంధానంలో కీలకపాత్ర పోషించనున్న ఈ సెంటర్లో దశలవారీగా వెయ్యి మందికి ఉపాధి లభించనుందన్నారు.