How To Open PPF Account | కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులు డబ్బును పొదుపు చేసేందుకు అనేక పథకాలను అందిస్తోంది. వాటిల్లో PPF కూడా ఒకటి. దీన్నే Public Provident Fund అంటారు. ఈ పథకంలో చేరేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చునే మీరు PPF ఖాతాను ఓపెన్ చేయవచ్చు. మీకున్న ఏదైనా బ్యాంకు అకౌంట్ ద్వారా ఈ అకౌంట్‌ను తెరవచ్చు. PPF అకౌంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PPF లేదా Public Provident Fund అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. ఇది పూర్తిగా సురక్షితమైంది. ఇందులో మీరు పొదుపు చేసే డబ్బుకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. కనుక ఈ పథకంలో నిర్భయంగా డబ్బును ఎవరైనా సరే పొదుపు చేయవచ్చు. ఇందులో పొదుపు చేసుకునే డబ్బుకు వడ్డీని పొందవచ్చు. దీంట్లో పొదుపు చేసుకునే డబ్బుతోపాటు వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో మీరు డబ్బును 15 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. తరువాత కావాలంటే 5, 5 సంవత్సరాలు మొత్తం 25 ఏళ్ల వరకు ఈ పథకం గడువును పొడిగించుకోవచ్చు.
PPF ఖాతాను ఎవరైనా సరే తెరవచ్చు. చిన్నారుల పేరిట కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. తల్లి, తండ్రి లేదా సంరక్షకుడు తమ చిన్నారుల కోసం ఈ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇక NRI లు కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఒకసారి ఖాతాను ఓపెన్ చేస్తే దాన్ని కొనసాగించవచ్చు. కానీ కొత్త ఖాతాను ఓపెన్ చేసేందుకు అనుమతించరు. PPF ఖాతాను రూ.500తో ఓపెన్ చేయవచ్చు. ఇందులో ఏడాదికి రూ.500 కనీసం పొదుపు చేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షలను ఒక ఏడాదిలో పొదుపు చేయవచ్చు. దీన్ని ఒకేసారి కట్టవచ్చు లేదా చిన్న చిన్న మొత్తాల్లో కట్టుకోవచ్చు.
PPF ఖాతాలో పొదుపు చేసుకునే డబ్బుకు ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. మీకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో ఖాతా ఉంటే వాటిల్లో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి అందులో PPF ఖాతాను తెరవచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చునే PPF ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అందుకు ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.
మీరు మీ బ్యాంకుకు సంబంధించి నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఉండే సర్వీసెస్ అనే సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. అందులో కొత్తగా PPF ఖాతాను ఓపెన్ చేసేందుకు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత మీ వ్యక్తిగత వివరాలను, నామినీ వివరాలను నమోదు చేయాలి. మీ ఆధార్, పాన్ తదితర పత్రాలను అప్లోడ్ చేయాలి. రూ.500 చెల్లించి ఖాతాను తెరవాలి. ప్రక్రియ పూర్తవగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇందులో మీరు ఏటా 15 ఏళ్ల వరకు డబ్బును పొదుపు చేయవచ్చు.
15 ఏళ్లు ముగిసిన తరువాత మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు. లేదంటే 5 ఏళ్ల చొప్పున మరో 2 సార్లు పొడిగించుకోవచ్చు. 7 ఏళ్ల తరువాత మీ డబ్బులో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినిస్తారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం 3వ ఏడాది తరువాత మీ డబ్బును విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉంటుంది. 3వ ఏడాది అనంతరం మీ డబ్బుపై లోన్ సౌకర్యం కల్పిస్తారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కనుక మీ డబ్బుకు 100 శాతం సెక్యూరిటీ ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం మీరు పొదుపు చేసుకునే డబ్బు, వడ్డీ డబ్బుపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇలా PPF ఖాతా పనిచేస్తుంది.