ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.
పెండ్లి సంగతి పక్కనబెడితే ఇంటి బరువు, బాధ్యతలు అన్నీఇన్నీ కావని ఆనాడే చెప్పారు.
అందుకే గృహ రుణాలకు అంత ప్రాధాన్యత. నాడైనా.. నేడైనా ఈ పరిస్థితిలో మార్పు మాత్రం లేదు. లోన్ మార్కెట్ గణాంకాలే ఇందుకు నిదర్శనం.
న్యూఢిల్లీ, జనవరి 2: దేశంలో సొంతింటి కల సాకారానికే అత్యధికులు పెద్దపీట వేస్తున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ బిజినెస్ లెక్కల్లో ఇదే తేలింది. దేశవ్యాప్తంగా తీసుకుంటున్న రుణాల్లో గృహ రుణాలదే అగ్రస్థానంగా ఉన్నది మరి. బ్యాంక్‌బజార్ తాజాగా రూపొందించిన మనీమూడ్ రిటైల్ క్రెడిట్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం గత ఏడాది అక్టోబర్ నాటికి ఉన్న మొత్తం రుణాల విలువ రూ.45.51 లక్షల కోట్లు. ఇందులో హోమ్ లోన్లే రూ.21.44 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. ఇది 47.11 శాతానికి సమానం. 2017-18 నుంచి 2021-22 మధ్యలోనే దాదాపు రూ.8 లక్షల కోట్లుగా గృహ రుణాల విలువ ఉండటం విశేషం.
వడ్డీరేట్లు తగ్గడంతో..
2020 మొదలు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి భారత్‌సహా యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసిందన్న సంగతీ విదితమే. మునుపెన్నడూ చూడని, కలలో కూడా ఊహించని లాక్డౌన్లతో ప్రపంచ ఎకానమీ స్వరూపమే మారిపోయింది. దీంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఆరంభించింది.
వరుస కోతలతో గృహ రుణాలుసహా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. రెపోరేటు 4 శాతం దరిదాపుల్లోకి దిగొచ్చి రియల్ ఎస్టేట్‌కు గొప్ప ఉత్సాహాన్నే ఇచ్చింది. అందరూ హోమ్ లోన్లపై ఇండ్లు కొనేసుకున్నారు. ఆ తర్వాత ద్రవ్యోల్బణం విజృంభించడంతో దాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ కూడా వడ్డింపులు మొదలు పెట్టింది. ఇప్పుడు రెపోరేటు 6.5 శాతానికి చేరినది తెలిసిందే. ఫలితంగా గృహ రుణాల మంజూరులో మునుపటి వేగం కూడా మందగిస్తూ వచ్చింది.
ఇతర రుణాల్లో..
గృహ రుణాలు కాకుండా ఇతర రుణా ల్లో వ్యక్తిగత రుణాలకు ఎక్కువగా డిమాండ్ కనిపిస్తున్నది. నిరుడు అక్టోబర్ నాటికి ఉన్న మొత్తం రుణాల్లో పర్సనల్ లోన్ల వాటా రూ.12.59 లక్షల కోట్లుగా ఉన్నది. మొత్తం రుణాల్లో ఇది 26.66 శాతం. మిగతా 26.23 శాతంలో వాహన, క్రెడిట్ కార్డ్, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) తాకట్టుపై తీసుకునే రుణాలు, విద్యా, బంగారం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, షేర్లు-బాండ్లు ఇతరత్రా వాటిపై తీసుకునే రుణాలున్నాయి.
మెడికల్ లోన్లకు డిమాండ్
మెడికల్ లోన్లకూ డిమాండ్ పెరిగింది. వ్యక్తిగత రుణాల్లో వీటి వాటా ఇటీవలికాలంలో పెరుగుతున్నట్టు తాజా రిపోర్టులో స్పష్టమైంది. భారీగా ఎగిసిన వైద్య ఖర్చులు, చాలామందికి సరిపడా ఆరోగ్య బీమా లేకపోవడం వంటి కారణాల నడుమ మెడికల్ లోన్లకు ప్రాధాన్యత పెరుగుతున్నట్టు బ్యాంక్‌బజార్ చెప్తున్నది.