న్యూఢిల్లీ, జూలై 30: ఆస్తుల తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ రుణ గ్రహితలకు షాకిచ్చింది. గృహ రుణాలపై బెంచ్మార్క్ లెండింగ్ రేటును పావుశాతం పెంచింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణాలపై వడ్డీరేటు 7.80 శాతం నుంచి 8.30 శాతం మధ్యలోకి చేరుకున్నాయి. గతంలో ఇది 7.55 శాతం నుంచి 8.05 శాతం మధ్యలో ఉన్నది. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత ఖాతాదారులకు కూడా ఈ వడ్డీరేటు వర్తించనున్నది. వచ్చేవారం ఆర్బీఐ సమీక్ష కంటే ముందే హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లను పెంచడం విశేషం. అలాగే గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఆర్పీఎల్ఆర్)ని కూడా పావు శాతం సవరించింది. ఈ పెంపు సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో గడిచిన రెండు నెలల్లో వడ్డీరేట్లను పెంచడం ఇది ఐదోసారి కావడం విశేషం. మే నెల నుంచి ఇప్పటి వరకు వడ్డీరేట్లు 115 బేసిస్ పాయింట్లు పెంచింది. సంస్థకు ఇప్పటికే ఉన్న కస్టమర్లు కూడా పావు శాతం అధిక వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది.