దేశంలో పారిశ్రామిక ప్రగతికి కొలమానంగా, ఆర్థికాభివృద్ధికి ప్రామాణికంగా పిలిచేకీలక రంగాలను నిస్తేజం ఆవరించింది. ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల తయారీలో నీరసం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది మరి. దేశ, విదేశీ పరిణామాలు మౌలిక రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గత నెల ఏప్రిల్‌లో 8 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భావిస్తున్న భారత్‌లో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే చెప్పవచ్చు.
న్యూఢిల్లీ, మే 20: మౌలిక రంగాల్లో వృద్ధిరేటు గాడి తప్పింది. 8 కీలక రంగాల్లో ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. గత నెల ఏప్రిల్‌లో బొగ్గు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, సహజ వాయువు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు, ఎరువుల రంగాల్లో వృద్ధి 8 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 0.5 శాతానికే పరిమితమైంది. ప్రధానంగా ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల తయారీ నిరాశాజనకంగా నడిచినట్టు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో కీలక రంగాల ఉత్పాదకతలో వృద్ధిరేటు 6.9 శాతంగా ఉన్నది. దీంతో ఈసారి 6.4 శాతం మేర పడిపోయినట్టు తెలుస్తున్నది. అలాగే అంతకుముందు నెల మార్చిలో 4.6 శాతంగా ఈ వృద్ధిరేటు నమోదైంది. కానీ ఏప్రిల్‌లో 0.5 శాతమే కావడంతో కేవలం నెల రోజుల్లో ఉత్పాదకత రేటు 4.1 శాతం వరకు పతనమైనట్టు తేలింది. ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల తయారీ వృద్ధి.. గతంతో పోల్చితే మైనస్‌లో ఉన్నది. నిరుడు ఆగస్టులో ఈ రంగాల ఉత్పాదకత రేటు మైనస్ 1.5 శాతంగా నమోదైంది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో సదరు రంగాల్లో వృద్ధిరేటు కనిపించిందని విశ్లేషకులు చెప్తున్నారు.
మౌలిక రంగాల్లో చోటుచేసుకున్న నిస్తేజం.. దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)ని ప్రభావితం చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌లో 8 కీలక రంగాల పనితీరు పెద్ద ఎత్తున పతనమైనట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో ఐఐపీ గణాంకాలు దాదాపు 1 శాతం మేర పడిపోవచ్చని అంచనా వేశారు. ఐఐపీలో ఈ 8 కీలక రంగా ల వాటానే 40.27 శాతంగా ఉన్నది మరి. ఇదిలావుంటే ఈసారి బొగ్గు, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్తు రంగాల ఉత్పాదకత వృద్ధిరేటు కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా ఇవి 3.5 శాతం, 0.4 శాతం, 3 శాతం, 1 శాతం చొప్పున ఉన్నాయి. అయితే సిమెంట్ ఉత్పత్తి 6.7 శాతానికి పెరిగింది. నిరుడు ఇదే ఏప్రిల్‌లో 0.2 శాతంగానే ఉన్నది. మొత్తానికి క్రూడ్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్ తయారీ పడిపోవడంతో మౌలిక రంగంలోని మిగతా రంగాల ప్రగతి కూడా మసకబారినైట్టెంది.