న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మి ఖజానాను నింపుకోవడానికి ఆత్రుతపడుతున్న నరేంద్ర మోదీ సర్కారు తాజాగా మరో విక్రయానికి సిద్ధమయ్యింది. గత ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పేరిట ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ)కు చెందిన ‘ది అశోక్’ హోటల్‌ను అమ్మకానికి పెట్టింది. ఢిల్లీలో 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ హోటల్‌కు ప్రభుత్వం రూ.7,409 కోట్ల సూచనాప్రాయ ధరను నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అశోక్ హోటల్ నగదీకరణ జరుగుతుందని, ఇందుకు సంబంధించి క్యాబినెట్ నోట్ రూపొందిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.
నాలుగేండ్లలో 8 హోటళ్ల విక్రయం
ఎన్ఎంపీలో భాగంగా ‘ది అశోక్’తో పాటు దాని పక్కనే ఉన్న హోటల్ సామ్రాట్‌తో సహా 8 ఐటీడీసీ ఆస్తుల్ని నాలుగేండ్లలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధానిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న అశోక్‌ను ప్రైవేట్‌కు సబ్-లీజ్‌గా ఇచ్చి నగదు చేసుకోవాలన్నది ప్రణాళిక కాగా, హోటల్ సామ్రాట్‌ను ఆపరేషన్ అండ్ మెయింటేనెన్స్ (ఓ అండ్ ఎం) ఒప్పందంపై ప్రైవేట్‌కు అప్పగించాలన్నది ప్రతిపాదన. జాతీయ నగదీకరణ పైప్‌లైన్ డాక్యుమెంట్ ప్రకారం ఎనిమిది ఐటీడీసీ హోటళ్లను విక్రయిస్తారు.
కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐటీడీసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణతో పాటు టూరిస్టులకు రవాణా సదుపాయాల కల్పిస్తున్నది. ప్రస్తుతం సంస్థకు నాలుగు అశోక్ గ్రూప్ హోటళ్లు, నాలుగు జాయింట్ వెంచర్ హోటళ్లు, ఏడు ట్రాన్స్పోర్ట్ యూనిట్లు, ఓడ రేవుల్లో 14 డ్యూటీ ఫ్రీ షాప్‌లు, నాలుగు కేటరింగ్ యూనిట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంపీ కింద రూ. 33,422 కోట్ల విలువైన ఆస్తుల్ని విక్రయించింది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 లక్షల కోట్ల ఆస్తుల్ని అమ్మాలన్నది కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.
