Antrapreneurs | న్యూఢిల్లీ, మార్చి 8: ఆర్థిక స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతున్న మహిళలు.. ఆంత్రప్రెన్యూర్స్‌గా రంగంలోకి దిగుతున్నారు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగిడుతున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ ఓ ప్రధాన సవాల్ ఎదురవుతున్నది. మదుపరుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నుంచి నిధుల సమీకరణ పొందడంలో అనేక అడ్డంకుల్ని చవిచూస్తున్నారు.
దీంతో ఈ పోటీ వ్యాపార ప్రపంచంలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్ సాధికారతకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ వేళ వినిపిస్తున్నాయి. కంపెనీలు, ఇన్వెస్టర్లు.. మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారని, పురుషులపట్ల పక్షపాత ధోరణిని అవలంభిస్తున్నారని తాజా ఓ రిసెర్చ్‌లో తేలింది.
62 శాతం మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు ఈ అనుభవం ఎదురైందన్న సదరు రిసెర్చ్.. నిధుల సమీకరణ సవాల్‌గా పరిణమిస్తున్నదని చెప్పడం గమనార్హం. ‘2022, 2023 మధ్య మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధులు 2.4 బిలియన్ డాలర్ల నుంచి 480 మిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు నిదర్శనం’ అని పిక్మైవర్క్ సహవ్యవస్థాపకురాలు కాజల్ మాలిక్ తెలిపారు. కాగా, ‘అత్యుత్తమ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 2021తో పోల్చితే 2023లో 21 నుంచి 26 శాతానికి పెరిగింది.
సామాజిక, ఆర్థికపరమైన అవరోధాలను అధిగమించేలా మరింత చేయూతనందిస్తే మహిళా ఉద్యోగులు మరెన్నో విజయాలను సాధించగలరు’ అని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సీఈవో యశస్వినీ రామస్వామి అన్నారు. ‘మహిళా ఉద్యోగులను కంపెనీలు కూడా ప్రోత్సహించాలి. వారి వృత్తిగత లక్ష్యాల సాధనకు తగినవిధంగా సహకరిస్తూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది’ అని యెస్‌మేడమ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆకాంక్ష వైష్ణోయ్ అన్నారు.
పెరిగిన మహిళా డైరెక్టర్లు
గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో దేశంలోని ఆయా కంపెనీల్లోని బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య క్రమేణా పెరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది 18.3 శాతానికి వచ్చినట్టు శుక్రవారం విడుదలైన డెలాయిట్ నివేదిక స్పష్టం చేసింది. 2018లో ఇది 13.8 శాతమే. ‘వుమెన్ ఇన్ ది బోర్డ్‌రూమ్: ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్’ పేరిట ఈ రిపోర్టు విడుదలైంది. అయితే ప్రపంచ సగటు 23.3 శాతంగా ఉన్నది.
కాగా, 50 దేశాల్లోని 18,000లకుపైగా సంస్థల బోర్డులను విశ్లేషించి ఈ నివేదికను డెలాయిట్ రూపొందించింది. ఇందులో 400 భారతీయ కంపెనీల బోర్డులనూ పరిశీలించారు. ఇదిలావుంటే 2018తో పోల్చితే 2023లో మహిళా సీఈవోలు 3.4 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగారు. రంగాలవారీగా అత్యధికంగా దేశీయ లైఫ్‌సైన్సెస్-హెల్త్‌కేర్ సంస్థల్లోనే మహిళా డైరెక్టర్లు 21.3 శాతంగా ఉన్నారు. రెండో స్థానంలో టెక్నాలజీ, మీడియా, టెలీకమ్యూనికేషన్స్ కంపెనీల బోర్డుల్లో మహిళలు 20.5 శాతంగా ఉన్నారు. ఆ తర్వాత కన్జ్యూమర్ బిజినెస్ (19.7 శాతం), తయారీ (17.4 శాతం), ఆర్థిక సేవల (16.9 శాతం) సంస్థలున్నట్టు డెలాయిట్ ఈ నివేదికలో పేర్కొన్నది.