Ola in Crisis | పెట్రో భారం తగ్గింపు.. కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యంగా విద్యుత్ టూవీలర్స్.. ప్రత్యేకించి స్కూటర్ల తయారీకి ముందుకొచ్చిన కొత్తతరం స్టార్టప్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్. గతేడాది ఆగస్టు 15న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1, ఎస్1 ప్రోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కానీ.. సంస్థ ఏడాది కాలంగా ప్రతిభావంతులైన నిపుణులను కాపాడుకోలేకపోతున్నది. సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌ల వలసలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కేవలం గత ఆరు నెలల్లోనే ఐదుగురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఓలా ఎలక్ట్రిక్‌కు గుడ్‌బై చెప్పేశారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈవీ టూ వీలర్స్ స్టార్టప్‌గా ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో మొబిలిటీ రంగం నుంచి ప్రతిభావంతులను ఆకర్షించడంలో ముందు ఉంది. కానీ అంతే స్థాయిలో నిపుణులు ఇతర సంస్థల్లో చేరిపోవడానికి క్యూ కడుతున్నారు. ఆ జాబితాలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పంకజ్ శర్మ నిలిచాడు. గమ్మత్తేమిటంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గతేడాది జూన్‌లోనే ఓలా ఎలక్ట్రిక్‌లో చేరారు. అంతకుముందు 2004-12 మధ్య మారుతి సుజుకితో సుదీర్ఘ అనుబంధం ఉంది పంకజ్శర్మకు. అంతకుముందు మాన్యూఫాక్చరింగ్ సీనియర్ డైరెక్టర్ షాజీ టైటస్.. సంస్థలో చేరిన 17 నెలల్లోనే బయటకు వచ్చేశారు.
గత అక్టోబర్‌లో కస్టమర్ పార్టనర్ సపోర్ట్ ఆపరేషన్స్ హెడ్- సీనియర్ డైరెక్టర్ గురిందర్ సింగ్ సుఖిజా వైదొలిగారు. మరో ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఎథేర్ ఎనర్జీ ఓనరిషిప్ మేనేజ్మెంట్ అధిపతిగా జాయినయ్యారు. గత నవంబర్లోనే ఓలా కమ్యూనికేషన్స్ స్ట్రాటర్జీ, మొబిలిటీ ఈవీ బిజినెస్ హెడ్‌గా పని చేస్తున్న మురళీ శశిధరన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఓలా ప్రత్యర్థి సంస్థ ఎథేర్ ఎనర్జీ కమ్యూనికేషన్స్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.
గత నవంబర్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ అధిపతి జోసెఫ్ థామస్ బయటికి వెళ్లిపోయారు. కంపెనీలో చేరిన ఏడాది లోపే జోసెఫ్ థామస్ బయకు వెళ్లడం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ మాన్యుఫాక్చరింగ్ వైస్‌ప్రెసిడెంట్ విశ్వనాథన్ రమేశ్ కూడా సంస్థకు గుడ్‌బై చెప్పినట్లు వినికిడి. కానీ దీనిపై స్పందించడానికి ఓలా ఎలక్ట్రిక్ అధికార ప్రతినిధి నిరాకరించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్టార్టప్ కో-ఫౌండర్లుగా ఉన్న అంకిత్ జైన్, అకింత్ భాటి, ఆనంద్ షా గతంలోనే సంస్థ నుంచి వైదొలిగారు. 2019 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా చేరినా.. కేవలం పది నెలల్లోనే బయటికొచ్చేశారు. అంతకుముందు ఏడేండ్ల పాటు హీరో మోటో కార్ప్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌కు గుడ్‌బై చెప్పేయగానే తిరిగి హీరో మోటో కార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.