Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు ముందస్తు ఆర్డర్లు పొందకుండా నిషేధించింది. ఎలన్‌మస్క్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థలో సబ్స్క్రిప్షన్లు తీసుకోవద్దని కూడా దేశ పౌరులకు సూచించింది.
స్టార్‌లింక్ దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎటువంటి లైసెన్స్ తీసుకోకుండానే ముందస్తు ఆర్డర్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కేవలం 99 డాలర్ల (మన కరెన్సీలో రూ.7400) కే ఏడాది పొడవునా బేటా వర్షన్ బ్రాడ్‌బాండ్ సేవలందిస్తామని ఆఫర్ చేస్తున్నది. అంతే కాదు ఈ మొత్తం (99 డాలర్లు) పూర్తిగా రీఫండబుల్ అని కూడా తెలిపింది.
శాటిలైట్ సాయంతో భారత్‌లోని మారుమూల ప్రాంతాలు.. గ్రామీణులకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు దేశీయ టెలికం సంస్థలతోపాటు ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ఎక్స్ అనుబంధ స్టార్‌లింక్, అమెజాన్ సారధ్య సంస్థ వన్‌వెబ్‌తో కలిసి భారతీ ఎయిర్టెల్, టాటా-టెలీశాట్ సంస్థలు పోటీ పడుతున్నది.
ఈ నేపథ్యంలో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డాట్) ప్రజలకు అడ్వైజరీ జారీ చేసింది. స్టార్‌లింక్ కంపెనీ ముందుగా నియంత్రణ, నిబంధనల ప్రకారం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్పటి వరకు భారత్‌లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తామని బుకింగ్స్ చేపట్టొద్దని తెలిపింది. ప్రస్తుతం స్టార్‌లింక్ తన వెబ్సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్లు పొందుతున్నది. స్టార్‌లింక్ ప్రీ-ఆర్డర్స్‌పై నిషేధం విధించిన విషయమై స్పందించడానికి సంస్థ భారత్ హెడ్ సంజయ్ భార్గవ నిరాకరించారు.