న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో వినూత్న సేవలకు శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ సేవలకు పెరుగుతుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ సేవలు అందించడానికి సిద్ధమైంది సంస్థ. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ క్విక్ సేవలను ఈ నెల చివర్లో బెంగళూరులో ప్రారంభించనున్నట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ ప్రకటించారు. కేవలం బుకింగ్ చేసుకున్న 15 నిమిషాల్లో డెలివరీ చేసేవిధంగా ఈ సేవలు ఉంటాయని, బెంగళూరులో విజయవంతమైతే ఈ సేవలను ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం క్విక్ కామర్స్ మార్కెట్ విలువ 6.1 బిలియన్ డాలర్లు ఉండగా, 2030 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. దీంతో ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు, ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రతి పోస్టల్ నంబర్లో 2 వేలకు పైగా ఉత్పత్తులను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బ్లింకిట్, జెప్టోలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి.
గేమ్‌చేంజర్‌గా ఏఐ
కృత్రిమ మేధస్సుతో దేశీయ రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉన్నదని సమీర్ కుమార్ వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రిటైల్ రంగాలు తదుపరి దశకు చేరుకోనున్నాయన్నారు. ఏఐ స్టార్టప్‌లో 120 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిధిగా హాజరైన కేంద్ర వినియోగదారుల వ్యహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ..ఈ-కామర్స్ సంస్థలు పారదర్శకంగా, వినియోగదారులు కోరుకుంటున్న విధంగా వ్యవహరించాలని సూచించారు.
మొదటి స్థానానికి భారత్: గడ్కరీ
వచ్చే ఐదేండ్లలో ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో దేశీయ ఆటోమొబైల్ రంగం మొదటి స్థానానికి చేరుకుంటున్నదన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు కేంద్ర రోడ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. గడిచిన రెండేండ్లలో లాజిస్టిక్స్ ఖర్చులను 9 శాతం వరకు తగ్గించగలిగామన్నారు. రూ.7 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న దేశీయ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. రూ.78 లక్షల కోట్లతో అమెరికా తొలిస్థానంలో నిలువగా, రూ.47 లక్షల కోట్లతో చైనా ఆ తర్వాతి స్థానంలో ఉన్నది.