బీజింగ్, జూలై 29: ఉత్పాదక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే చైనా.. చిప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఎన్నో ఏండ్లుగా సెమీకండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న డచ్ కంపెనీ ఏఎస్ఎంఎల్కు చెక్ పెట్టింది మరి. ప్రపంచంలో చిప్‌ల తయారీలో అత్యంత అధునాతన లితోగ్రఫీ మెషీన్లను ఏఎస్ఎంఎల్ మాత్రమే వినియోగిస్తున్నదని అంచనా. అయితే ఈ అంచనాలను తారుమారు చేస్తూ డ్రాగన్ కంట్రీ పెద్ద ఎత్తున ఇమ్మర్షన్ డీప్ అల్ట్రావాయిలెట్ (డీయూవీ) లితోగ్రఫీ మెషీన్లను స్థానికంగా అభివృద్ధి చేస్తున్నదిప్పుడు. ప్రభుత్వ రంగ సంస్థ షాంఘై ఐషెంగ్నా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్ ఈ డీయూవీ మెషీన్లను తయారు చేస్తున్నది. వివిధ ప్రధాన చైనీస్ లితోగ్రఫీ స్టార్టప్‌లకు చెందిన ఇంజినీరింగ్ బృందాల సహకారం తీసుకుంటున్నట్టు చెప్తున్నారు.
ధరలు తగ్గుతాయా?
ప్రస్తుతం ఎన్నో రంగాలు చిప్‌ల వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, ఐరోపా దేశాలదే తయారీలో హవా. ఈ క్రమంలో చైనా ఎంట్రీ మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. మాన్యుఫ్యాక్చరింగ్‌లో చైనా దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చైనా చిప్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే భారీగా ధరలు తగ్గుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. నిజానికి చిప్‌ల తయారీకి కావాల్సిన అన్ని వనరులు చైనాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలో డీయూవీ లితోగ్రఫీ మెషీన్లు మార్కెట్లోకి వస్తే చిప్ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోగలవన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే డీయూవీ మెషీన్లు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది 5 మెషీన్లనే తయారు చేసి, వచ్చే ఏడాది దాదాపు 20కి పెంచాలన్న యోచనని చైనా వర్గాలు పేర్కొంటున్నాయి.
డీయూవీ-ఈయూవీ
సెమీకండక్టర్ తయారీలో లితోగ్రఫీ మెషీన్లను హృదయంతో పోలుస్తారంతా. అయితే ఇప్పుడు ఎక్కువగా అడ్వాన్స్డ్ చిప్‌లు ఎక్స్ట్రీమ్ అల్ట్రావాయిలెట్ (ఈయూవీ) లితోగ్రఫీ వినియోగంతోనే తయారవుతున్నాయి. ఈ టెక్నాలజీ వినియోగంలో ఏఎస్ఎంఎల్దే ఆధిపత్యం. యాపిల్ వంటి కంపెనీల కటింగ్-ఎడ్జ్ ప్రాసెసర్స్ డిజైనింగ్ ఈయూవీతోనే అవుతున్నది. అలాగే ఎన్విదియా, టీఎస్ఎంసీ వంటి చిప్ తయారీ సంస్థలూ ఈ టెక్నాలజీనే వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తెచ్చే ఇమ్మర్షన్ డీయూవీ సిస్టమ్స్.. ఈయూవీ సామర్థ్యాలను అందుకోలేవన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పైగా డీయూవీల తయారీ సంక్లిష్టంగా ఉండటమేగాక, అందుకయ్యే ఖర్చూ ఎక్కువేనని చెప్తున్నారు. ఇక ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లలో వాడే విస్తృత శ్రేణి చిప్‌ల తయారీకి ఈయూవీ సాయాన్నే తీసుకుంటున్నారంతా. అయినా చైనా డీయూవీ రాకతో చిప్‌ల తయారీ కొత్త పోకడను సంతరించుకోగలదన్న విశ్వాసం కనిపిస్తున్నది.