హైదరాబాద్: ఈ రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వినయోగం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. దాంతో శక్తికి మించిన ఖర్చులు కూడా చేస్తున్నారు. అయితే ఈ కార్డులను వినియోగించేటప్పుడు సింగిల్ ట్రాన్సక్షన్లో ఎంతవరకు తీసుకోవాలనేదానిపై పరిమితులు సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ కార్డుపై ఒక సింగిల్ ట్రాన్సక్షన్లో రూ.5 వేలకు మించి లావాదేవీ చేయకూడదు అనుకుంటే, అందుకు తగ్గట్టే పరిమితిని సెట్ చేసుకోవచ్చు.
కార్డు పరిమితిని సెట్ చేసుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా లిమిట్ సెట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి పరిమితి విధించాలనుకుంటున్న కార్డు వివరాలను నమోదు చేయాలి. దేశీయ లావాదేవీల కోసం లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం పరిమితి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? లేదా ఇతర మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకులతోపాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీ పాస్వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ డెబిట్ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను రూ.5 వేలకు సెట్ చేసుకుంటే.. ఏదైనా మోసం జరిగినా రూ.5 వేలకు మించకుండా ఉంటుంది.