IT Returns | గత ఆర్థిక సంవత్సర (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చేసింది. వేతన జీవుల నుంచి విభిన్న వర్గాల వారు ఐటీ దాఖలు చేసేందుకు ఐటీఆర్ ఫామ్‌లను ఆదాయం పన్ను విభాగం తన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ సిబ్బందికి ఫామ్-16 అందిస్తున్నాయి. వచ్చేనెలాఖరులోపు ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి.
ఇందుకు ఏఐఎస్ లేదా టీఐఎస్, బ్యాంకు ఖాతా డిటైల్స్, మీ పెట్టుబడులపై ఆదాయం, డివిడెండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, ఇండ్ల అద్దె తదితర రూపాల్లో వచ్చిన ఆదాయం తదితర వివరాలు ఉన్న డాక్యుమెంట్స్ సమకూర్చుకోవాలి. ఈ సందర్భంలోనే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో పలువురు పొరపాట్లు చేస్తూనే ఉంటారు.. ఆ పొరపాట్లేంటో తెలుసుకుందాం..
మీ ఆదాయం, ఆదాయ మూలాలను బట్టి ఐటీ ఫామ్ సబ్మిట్ చేయాలి. సరైన ఐటీ రిటర్న్స్ ఫామ్ ఎంచుకోవడానికి ఇది చాలా కీలకం. వేతనం ద్వారా మాత్రమే ఆదాయం వచ్చే వారు ఐటీఆర్-1 ఫామ్ ఎంచుకుంటే చాలు.. పెట్టుబడులపై ఆదాయం, ఇతరత్రా ఆదాయాలు ఉంటే ఐటీఆర్-2 / ఐటీఆర్-3 ఎంచుకోవాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-4 వరకు తమకు సరిపోయే ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేముందు మేనేజ్మెంట్లు ఇచ్చే ఫామ్-16తోపాటు ఐటీ పోర్టల్ లో లభించే ఫామ్-26 ఎఎస్, వార్షిక ఇన్ఫర్మేసన్ రిపోర్ట్ (ఏఐఎస్) సరి చూసుకోవాలి. ఇందులో మీకు వచ్చే ఆదాయం, చెల్లించిన పన్ను డిటైల్స్, ఎక్కువ మొత్తంలో జరిగిన లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర వివరాలు ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా ? అనే అంశం చెక్ చేసుకోండి. ఐటీ విభాగం ఫామ్ 26ఏఎస్ లో ఉన్న గణాంకాలను మాత్రమే పరిగణిస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ తప్పులుంటే సవరణకు నిపుణులను సంప్రదించాలి.
ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్న్స్) దాఖలు చేయడానికి ఫామ్-16 ముఖ్యమైంది. రిటర్నులు దాఖలు చేయడానికి ఇదొక్కటే సరిపోదు. వేతనం ఒక్కటే మీ ఆదాయమైనా.. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయం వివరాలు వార్షిక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఏఐఎస్)లో ఉంటాయి. కనుక పూర్తిగా మన వాస్తవ ఆదాయం ఎంత అన్నది తెలుసుకోవడానికి ఫామ్-26ఏఎస్, ఏఐఎస్ లతో చెక్ చేసుకోవడం బెటర్.
ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఒక్కోసారి ఆర్థిక సంవత్సరం మధ్యలోనే మరో కంపెనీలో చేరతారు. అటువంటప్పుడు వారికి రెండు ఫామ్-16లు ఉంటాయి. రెండు కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు తెలియజేయాలి. పాత కంపెనీలో వచ్చిన ఆదాయం వివరాలు ‘ఫామ్-12బీ’ ద్వారా కొత్త సంస్థకు తెలియజేయాలి. దీంతో కొత్త కంపెనీ యాజమాన్యం ఆ డిటైల్స్ తన ఫామ్-16లో పొందుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల ఒకే ఆదాయం లేదా పన్ను కోత లేదా పన్ను మినహాయింపు లేదా క్లియమ్ రెండు సార్లు రిపీట్ కావు.
పెట్టుబడులపై లాభాల రూపంలో వచ్చే ఆదాయం, అసెట్ క్లాస్ ఆధారంగా పన్ను ఖరారవుతుంది. ఈక్విటీ మార్కెట్లలో స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ఒకే ఆర్థిక సంవత్సరంలో విక్రయిస్తే ఒకే పన్ను.. దీర్ఘకాలం కొనసాగించి విక్రయిస్తే మరొక పన్ను రేటు ఉంటుంది. కనుక ఆదాయం వివరాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు. పెట్టుబడులపై లాభాలను గణించడంలో ఇబ్బందులు తలెత్తితే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మరిచిపోవద్దు.
అత్యధికులు చివరి క్షణంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తప్పులు దొర్లే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు ఆదాయం పన్ను విభాగం వెబ్ సైట్ లో కూడా అవాంతరాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఐటీ రిటర్న్స్ గడువు దాటిపోయి, ఫైన్‌తో ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు బ్యాంకు డిటైల్స్ ఇవ్వాలి. ఐటీ విభాగం నుంచి వచ్చే రీఫండ్స్ ఆ ఖాతాలోనే జమ అవుతాయి. కనుక బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన 120 రోజుల్లోపు వెరిఫై చేసుకోవాలి.. లేకపోతే మళ్లీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది.