Bank Deposits | మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఎస్బీఐతోపాటు బీవోబీ, పీఎన్బీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతోపాటు ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లను భారీగా పెంచుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీరేట్లను ఒక్క శాతానికి పైగా సవరించాయి. గతంలో కేవలం 3-4 శాతం స్థాయిలో ఉన్న రేట్లు ఇటీవల కాలంలో 8-10 శాతం మధ్యలోకి చేరాయి. ఏయే బ్యాంకులు ఎంతమేర వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయో ఒక్కసారి చూద్దాం…
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అర శాతం వరకు సవరించింది. ఈ పెంపు 180 రోజుల నుంచి 270 రోజులలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది. దీంతో సాదారణ ప్రజలకు 6 శాతం వడ్డీని చెల్లిస్తున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా చెల్లిస్తున్నది. అలాగే 271 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై వడ్డీని 45 బేసిస్ పాయింట్లు అధికం చేయడంతో రేటు 7.25 శాతానికి చేరుకున్నది. ప్రస్తుతం బ్యాంక్ 3.5 శాతం నుంచి 7.25 శాతం లోపు వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచేసింది. ఏడాది నుంచి 15 నెలల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 6.6 శాతానికి సవరించింది. అలాగే 15 నెలల నుంచి 18 నెలల్లోపు డిపాజిట్లపై వడ్డీని సైతం 7.10 శాతానికి పెంచిన బ్యాంక్..18-24 నెలల్లోపు డిపాజిట్లపై 7 శాతానికి పెంచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ సైతం
ఏడాది నుంచి 389 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 7.25 శాతానికి సవరించింది ఐసీఐసీఐ బ్యాంక్. అలాగే 61 రోజుల నుంచి 90 రోజుల్లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై రేటును 4.5 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. 91 నుంచి 184 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 6.5 శాతానికి సవరించిన బ్యాంక్..185-270 రోజుల డిపాజిట్లపై 6.75 శాతానికి, 390 నుంచి 15 నెలల లోపు డిపాజిట్లపై 7.25 శాతానికి పెంచింది. ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు డిపాజిట్లపై రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్‌దారులను ఆకట్టుకోవడానికి వడ్డీరేట్లను అర శాతం మేర పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 3.5 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం చెల్లిస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఒక అడుగు ముందుకేసి డిపాజిట్లపై అత్యధికంగా 125 బేసిస్ పాయింట్లు సవరించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ నూతన వడ్డీరేట్లు వర్తించనున్నాయని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎఫ్డీలపై వడ్డీరేటు 4.25 శాతం నుంచి 7.25 శాతం మధ్యలో ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మాత్రం 4.75 శాతం నుంచి 7.75 శాతం మధ్యలో చెల్లిస్తున్నది.