BMW X3 20d M Sport | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త కారు తీసుకొచ్చింది. ‘ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ (X3 20D M Sport)’ అనే పేరుతో ఆవిష్కరించిన కారు ధర రూ.69.90 లక్షలుగా నిర్ణయించింది. ఇది 20డీ లగ్జరీ ఎడిషన్ కారుతో పోలిస్తే రూ.2.6 లక్షలు పిరం. ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ మోడల్ కారు 2.0 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 190 హెచ్‌పీ విద్యుత్, 400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. బీఎండబ్ల్యూ కొత్తగా తీసుకొచ్చిన ‘ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్’ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నది. ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ (X3 20d M Sport) కారులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ కార్డోన్ సౌండ్ సిస్టమ్, విండోస్ చుట్టూ బ్లాకౌట్ ప్రేమ్, బ్లాకౌట్ రూఫ్ రైల్, డీప్యూజర్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, లెదర్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్తగా బీఎండబ్ల్యూ కారును ఆవిష్కరించడంతో ‘ఎక్స్3’ పెట్రోల్ వేరియంట్‌ను నిలిపేయాలని నిర్ణయించింది. దీంతోపాటు 5 సిరీస్ సెడాన్, 6సిరీస్‌లో 630డీ వేరియంట్ కార్లను నిలిపేసింది. 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లూ బ్రేక్ కాలిపర్స్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 2.0- లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్లో మాత్రం 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తున్నది.
మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లు ఆడీ క్యూ5, మెర్సిడెస్-బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, లెక్సాస్ ఎన్ఎక్స్ వంటి మోడల్స్‌తో ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ పోటీ పడనున్నది. అయితే ఆడీ, మెర్సిడెస్, వోల్వో కార్లు పెట్రోల్ పవర్ ట్రైన్ వేరియంట్లో మాత్రమే వస్తున్నాయి. లెక్సాస్ ఎన్ఎక్స్ మాత్రం స్ట్రాంగ్-హైబ్రీడ్ పవర్‌ట్రైన్‌తో యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
ఇదిలా ఉంటే వచ్చే మే నెలలో న్యూ జనరేషన్ ఎం2 కూపె కారును బీఎండబ్ల్యూ ఆవిష్కరించనున్నది. భారత్‌లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ వస్తుంది. అదే నెలలో జీ4 కన్వర్టిబుల్, ఆగస్టులో ఎక్స్5 ఎస్యూవీ కార్లను దేశీయ మార్కెట్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసింది.