న్యూఢిల్లీ, మే 4: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండున్నర రెట్ల వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.504.45 కోట్లుగా ఉన్న నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,290.47 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
విద్యుత్ రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.9,142.64 కోట్ల నుంచి రూ.12,553.50 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది. దీంట్లో విద్యుత్ రంగం నుంచి రూ.9,509.85 కోట్లు సమకూరాయి.