Mutual Funds | ప్రతి వేతన జీవి.. తన కుటుంబ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వివిధ స్కీమ్‌లు, రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. చాలా మంది ఇండ్లు, ఇండ్ల స్థలాల కొనుగోళ్లు.. ఎల్ఐసీ తదితర బీమా సంస్థల్లో బీమా పాలసీలు.. ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేస్తుంటారు. మరి కొంత మంది నేరుగా స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంటారు. రిటర్న్స్ అందించడంలో వేటికవే సాటి. అయితే వీటితోపాటు పెట్టుబడులపై మెరుగైన రిటర్న్స్ హామీ ఇచ్చే మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఒకటి. వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుందని నిపుణులు, ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
తమ వద్ద ఉన్న నగదును ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్న విషయమై చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ.. ఇంటర్నెట్లోకి వెళ్లి కొద్దిసేపు సెర్చ్.. రీసెర్చ్ చేసినా.. ఆర్థిక నిపుణులను అడిగినా ఎటువంటి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలో స్పష్టత వస్తుంది. ఆన్లైన్లో రీసెర్చితోనూ, నిపుణల సలహా మేరకో మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడులు పెడుతున్న వారికి అవగాహన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలను తీర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ సరైన వేదికగా భావిస్తున్నారు. వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించే వారు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.. అవేమిటో ఓ లుక్కేద్దాం..!
మీ దగ్గర అందుబాటులో ఉన్న నగదును ఒకటి, రెండు మ్యూచువల్ ఫండ్స్‌లకు పరిమితం చేయకుండా.. విభిన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని ఫండ్స్‌లో ఆశించిన దానికంటే మెరుగ్గా రిటర్న్స్ వస్తే.. మరికొన్నింటి రిటర్న్స్ అంతగా ఉండకపోవచ్చు. కొన్నింటిల్లో వచ్చిన అధిక రిటర్న్స్.. మరికొన్నింటిలో మామూలుగా వచ్చే రిటర్న్స్‌తో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయొచ్చు. ఆయా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న క్రమంలో ఏది బెస్ట్ అన్న సంగతి.. నష్టాలు నివారించుకోవడం ఎలాగో తెలుస్తుంది. అలా తెలిసే వరకు విభిన్న ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారు దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. కొన్ని మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మరికొన్ని ఇండెక్స్ ఫండ్స్‌లో మదుపు చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక దశాబ్ధి గడువుతో పెట్టుబడులు పెట్టిన వారికి నష్ట భయం తక్కువ. ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రిస్క్ ఎక్కువ. తక్కువ గడువు గల ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్ట భయం ఎక్కువగానే ఉంటుంది.
దేశంలో పలు రకాల మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉన్నాయి. ఒక్కో సంస్థ పలు రకాల ఫండ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. వాటిల్లో స్థిరమైన.. నిలకడగా లాభాలు ఇచ్చే పథకాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా సంస్థల అనుభవం.. పేరు ప్రతిష్టలతో నిమిత్తం లేకుండా.. వాటి పథకాలతో వచ్చే రిటర్న్స్.. ఆన్లైన్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. రెగ్యులర్ ప్లాన్ల కంటే.. తక్కువ ఖర్చుతో కూడిన స్కీమ్‌ల్లో పెట్టుబడులకు మొగ్గితే మంచిదని నిపుణులు అంటున్నారు.
మంచి నిధి పొందాలని భావించే వారు ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద వాయిదాల వారీగా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే బావుంటుంది. ఈక్విటీ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పుడు నష్టాలొచ్చినా.. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక లాభాలు పొందొచ్చు. చిన్న, చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టే వారు.. ప్రతి నెలా తమ బ్యాంక్ ఖాతా ద్వారా ఆయా మ్యూచువల్ ఫండ్స్‌కు నిధులు కేటాయించేలా సిప్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. రోజురోజుకు పెరిగిపోతున్న ధరల ప్రభావం నుంచి బయటపడాలంటే వేతన జీవులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలు, వాటి నిర్వహణ తీరు తెన్నులు సమీక్షించుకోవాలి. అవసరమైతే ఇతర ఫండ్స్‌లోకి నిధులు మళ్లించడం వల్ల రిస్క్‌ల నుంచి బయట పడొచ్చు.