Mutual Funds in Demat | చిరుద్యోగి నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్.. క్లర్క్ స్థాయి ఉద్యోగి నుంచి అధికారి వరకూ.. కార్మికుడు మొదలు సూపర్వైజర్ వరకూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ నిర్వహణకు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.. రోజువారీ కుటుంబ నిర్వహణ ఖర్చులతోపాటు భవిష్యత్ అవసరాలకు ఇప్పటినుంచే ప్లాన్ అమలు చేస్తూ ఉండాలి.. అలా చేస్తేనే కష్టకాలంలో.. అవసరమైనప్పుడు నిధుల కొరత ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చిరుద్యోగులైనా.. అధికారులైనా.. ఐటీ నిపుణులైనా.. ప్రతి ఒక్కరూ కొద్ది కొద్ది మొత్తాలు పొదుపు చేయడం ప్రారంభించాలి.. క్రమంగా తమ పొదుపు మొత్తాలు పెంచుకుంటూ.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అమలు చేస్తూ ముందుకెళ్లాలి.. అందుకు మ్యూచువల్ ఫండ్స్ వెసులుబాటుగా ఉంటాయి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో తమ పొదుపు మొత్తం మదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరైతే నేరుగా మ్యూచువల్ ఫండ్స్‌లో నిధులు పెడుతున్నారు. 2011లోనే ఓపెన్ ఎండెడ్ పథకాలను డీమ్యాట్ ఖాతాల్లో నిర్వహించుకునే వీలు కల్పిస్తూ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. డీమ్యాట్ ఖాతాల్లో మ్యూచువల్ ఫండ్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు. అలా నిర్వహించుకోవడం వల్ల బెనిఫిట్లు ఏమిటో తెలుసుకుందాం..
డీమ్యాట్ ఖాతా అంటే కేవలం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్.. షేర్ల క్రయ విక్రయాలకోసమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అటువంటి వారు తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డీమ్యాట్ ఖాతాల్లో చేర్చడం వల్ల ఒనగూడే ప్రయోజనాలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ప్రత్యేక ఫోలియోలో ఉన్నాయన్న విషయం తెలియకపోవచ్చు. డీమ్యాట్ ఖాతా వల్ల స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు భద్రత ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతన్న ఎకానమీలో పెట్టుబడిదారులు.. మదుపర్లు తమ పథకాల నిర్వహణకు పలు టెక్నాలజీ పద్దతులు అమల్లోకి వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు సంప్రదాయ ఫోలియోల నుంచి డీమ్యాట్ ఖాతాల్లోకి మార్చుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌సీడీఎల్) కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)లో కనించే మ్యూచువల్ ఫండ్స్ ప్రత్యేక ఫోలియోలో ఉంటే.. వాటిని తేలిగ్గా డీమ్యాట్ అకౌంట్స్‌లో మార్చుకోవచ్చు. పూర్తిగా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ చేపట్టవచ్చు. ఇన్వెస్టర్లు ఏ పత్రాలు సమర్పించనవసరం లేదు..
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.. అందుకోసం మీ డీమ్యాట్ ఖాతా నుంచి మీరు గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన వ్యక్తి డీమ్యాట్ అకౌంట్‌కు బదిలీ చేయొచ్చు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను గ్యారంటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తాకట్టు పెట్టి స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయ విక్రయాలు సాగించవచ్చు. కొత్తగా న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) వచ్చినప్పుడు తేలిగ్గా దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఫామ్‌లో డీమ్యాట్ ఖాతా వివరాలు ఎంటర్ చేస్తే చాలు. డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం వల్ల సేవింగ్, ట్రేడింగ్‌తోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ తేలికవుతుంది. ఎప్పటికప్పుడు ఆయా ఫండ్స్ యూనిట్ల లావాదేవీల వివరాలు తెలిసిపోతాయి.
ఇన్వెస్టర్ మరణిస్తే.. నామినేషన్ పద్దతిలో సదరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తేలిగ్గా సదరు నామినీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే, డీమ్యాట్ ఖాతాలోనూ నామినీ పేరు ఉండాలి. వారసులు ఆ డీమ్యాట్ ఖాతాలోని అన్ని పెట్టుబడులను తేలిగ్గా క్లయిమ్ చేయవచ్చు. కాకపోతే వేర్వేరు పోర్ట్ ఫోలియోల్లో ఉంటే మాత్రం వాటికి వెనక్కి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.
డీమ్యాట్ ఖాతాలో ఇన్వెస్టర్ తన సమాచారంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా ఆ మార్పులు చేర్పులు చేయవచ్చు. అడ్రస్, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలు మారిస్తే చాలు. షేర్లు, బాండ్లు, ఫండ్స్ సహా అన్ని మారిపోతాయి. మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేసిన వారు తమ కేవైసీ పత్రాలు సమర్పించాలి. పెట్టుడులు పెట్టిన ప్రతిసారీ కేవైసీ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డీమ్యాట్ ఖాతా ప్రారంభిస్తున్నప్పుడే కేవైసీ పూర్తవుతుంది కనుక ఈ అకౌంట్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మదుపర్లకు సమయం కలిసి వస్తుంది.