BedBath & Beyond CFO | అమెరికాలోని కార్పొరేట్ సంస్థ బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గుస్టావో అర్నాల్ (52) న్యూయార్క్ లోని జెంగా టవర్ వద్ద 18 అంతస్తుల భవనం పై నుంచి దూకడంతో మరణించాడు. బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ సంస్థ కొన్ని రోజుల క్రితం పలు స్టోర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే సీఎఫ్‌వో దుర్మరణం పాలయ్యాడని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. బెడ్ బాత్ అండ్ బియాండ్ సంస్థలో గుస్టావో అర్నాల్ 2020లో చేరారు. అంతకుముందు ఆయన లండన్‌లోని ఒక కాస్మొటిక్స్ కంపెనీ బ్రాండ్ అవోన్ సీఎఫ్‌వోగా పని చేశారు. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థలో 20 ఏండ్ల కెరీర్ కలిగి ఉన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒక భవనం వద్ద కింద 52 ఏండ్ల వ్యక్తి మరణించి ఉన్నాడని 911 నంబర్‌కు సమాచారం వచ్చిందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అతడ్ని గుస్టావో అర్నాల్గా గుర్తించామని తెలిపారు. అయితే, అతడి మరణానికి కారణాలను వెల్లడించలేదు. అంతకుముందు గత నెల 16న కంపెనీలో 55,013 షేర్లను విక్రయించేశాడు. గతవారం తమకు గల 900 స్టోర్లలో 150 స్టోర్లను మూసేస్తున్నట్లు బెడ్‌బాత్ అండ్ బియాండ్ ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునేందుకు 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది.
2020 ఏప్రిల్‌లో తమ సంస్థలో అర్నాల్ చేరినప్పుడు బెడ్‌బాత్ అండ్ బియాండ్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తాము అంతర్జాతీయ స్థాయి గల ప్రతిభావంతులను పొందామని తెలిపారు. ఆయన అనుభవంతో తమ బిజినెస్‌ను పునః నిర్మిస్తామని చెప్పారు. కానీ అనుకున్న మేరకు ఫలితాలు రాలేదు. తొలి త్రైమాసికంలో సంస్థ సేల్స్ 25శాతం పడిపోయాయి. దీంతో సీఈవో మార్క్ ట్రిట్టన్కు ఉద్వాసన పలికింది. తాత్కాలిక ప్రాతిపదికన స్యూ గోవ్ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది.