Credit Card Usage | గతంలో సంపన్నులు, వ్యాపారులు, బ్యాంకుల్లో నిత్యం లావాదేవీలు జరిపే వారికి మాత్రమే క్రెడిట్ కార్డులు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని క్యాటగిరీల వ్యక్తులు, ఉద్యోగుల వద్ద క్రెడిట్ కార్డులు దర్శనం ఇస్తున్నాయి. అయితే, ఫస్ట్‌టైం క్రెడిట్ కార్డులు తీసుకునే వారు దాని వాడకంలో పొరపాట్లు, తప్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ తన క్రెడిట్ కార్డు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డు మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు వంటిదే. మీరు మాత్రమే సదరు క్రెడిట్ కార్డు వాడేందుకు అనుమతి ఉంటుంది. మీరు ఆ క్రెడిట్ కార్డు మీ బంధు మిత్రులకు ఇవ్వొద్దు. పిన్ నంబర్‌తోపాటు క్రెడిట్ కార్డును ఇవ్వడం వల్ల ఇతరులు ఆన్లైన్లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరిమితికి మించి లావాదేవీలు జరుపొచ్చు. ఒక్కోసారి ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు కూడా.. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రెడిట్‌కార్డు జారీ సంస్థలు బాధ్యత వహించవు. అపరిమితంగా లావాదేవీలు జరుపడం, క్యాష్ విత్ డ్రా చేయడం వల్ల మీపై అదనపు భారం పడుతుంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఏదైనా దుకాణంలోగానీ, హోటల్లో గానీ ఆఫ్‌లైన్ లావాదేవీలు జరిపినప్పుడు మీరు మీ సమక్షంలోనే క్రెడిట్ కార్డు స్వైప్ చేయమని చెప్పాలి. దుకాణంలో సేల్స్‌మన్‌కు గానీ, హోటళ్లు, రెస్టారెంట్లలో వెయిటర్‌కు గానీ క్రెడిట్ కార్డు పిన్ నంబర్ చెప్పొద్దు. సేల్స్‌మన్ లేదా వెయిటర్ గానీ మీరిచ్చే క్రెడిట్ కార్డు క్లోనింగ్ చేసి, తర్వాత దుర్వినియోగం చేసే ప్రమాదాలు ఉన్నాయి.
ఆన్లైన్లో లాగ్ ఇన్, పాస్వర్డ్, సీవీవీ తదితర డేటా రహస్యంగా ఉంచాలి. బయటి వారికి క్రెడిట్ కార్డు సమాచారం తెలిస్తే దుర్వినియోగం చేసే అవకాశాలే ఎక్కువ. బహిరంగ ప్రదేశాల్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ల ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేయడం మానుకుంటే బెటర్‌గా ఉంటుంది. మూడు నెలల నుంచి ఆరు నెలలకోసారి ఆన్లైన్ లాగ్ ఇన్ పాస్వర్డ్, పిన్ నంబర్లు మార్చుకుంటూ ఉండాలి.
యాప్ ద్వారా రోజువారీ క్రెడిట్ కార్డుల వాడకంపై పరిమితి విధించుకోవచ్చు. విదేశాలకు వెళ్లినప్పుడు ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డు గరిష్ఠ వాడకంపై పరిమితి పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ పరిశీలించుకోవాలి. ఒక్కోసారి అనధికారిక లావాదేవీలు మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లో కలువొచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవాలి. పాత రుణాల బకాయిలు ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే పొరపాట్లను దిద్దుకోవచ్చు.
డేటా చౌర్యం నుంచి రక్షించుకునేందుకు టోకెనైజేషన్ చాలా ఉపకరిస్తుంది. ప్రత్యేక కోడ్ ద్వారా మీ కీలక డేటా తెలవనివ్వదు టోకెనైజేషన్. ఆన్లైన్ లావాదేవీలు చేసినప్పుడు మీ వ్యక్తిగత డేటా బయటపడదు. టోకెనైజేషన్ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించింది ఆర్బీఐ. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించాలి. కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించొచ్చు. యాప్ ద్వారా గానీ, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారాగానీ బ్లాక్ చేయాలి.
అనుమానాస్పద వెబ్సైట్లలో మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆన్లైన్ పేమెంట్స్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లో వచ్చే వివాదాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు. బ్యాంకు అధికారుల పేరిట ఫోజు కొట్టే వారు ఫోన్ చేసి మీ కార్డు వివరాలు అడిగితే చెప్పొద్దు. అనధికారిక, అనుమానాస్పద యాప్‌లను మీ సిస్టమ్‌లోకి గానీ, ఫోన్లో గానీ డౌన్లోడ్ చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.