Cyber Crime | ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త.. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న కేటుగాళ్లు
నేడు అంతటా డిజిటల్ బ్యాంకింగే. అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి.
- ఆన్లైన్ మోసాలపై కస్టమర్లను హెచ్చరిస్తున్న బ్యాంకులు
- అనవసరపు మెసేజ్‌లు, లింక్‌లపై క్లిక్‌చేస్తే అంతే సంగతి
- ఓటీపీలు, అపరిచిత కాల్స్‌కు స్పందించవద్దని సూచనలు
Cyber Crime | హైదరాబాద్/ముంబై/న్యూఢిల్లీ, మే 21: నేడు అంతటా డిజిటల్ బ్యాంకింగే. అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇదే.. సైబర్ మోసగాళ్లకు కూడా చేతినిండా పని దొరికేలా చేస్తున్నది. ఖాతాదారుల అమాయకత్వం, ఏమరుపాటే ఈ కేటుగాళ్ల పెట్టుబడి. రోజురోజుకూ సరికొత్త వ్యూహాలతో స్కాములకు తెగబడుతున్నారు. మోసపోయామని బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నవారెందర్నో మనమూ చూస్తూనే ఉన్నాం. దీంతో బ్యాంకర్లు కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ, పీఎన్బీతోపాటు.. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ మరికొన్ని తమతమ ఖాతాదారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నాయి.
మొబైల్ ఫోన్లకు వచ్చే అనవసరపు మెసేజ్‌లు, లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఓటీపీలు, డెబిట్/క్రెడిట్ కార్డు నెంబర్ల పిన్ నెంబర్లు, ఇతరత్రా సమాచారం ఎవరికీ ఇవ్వరాదని కోరుతున్నాయి. ఈ తరహా మెసేజ్‌లు, కాల్స్‌పై దగ్గర్లోని బ్యాంక్ శాఖల్లో ఫిర్యాదు కూడా చేయవచ్చని చెప్తున్నాయి. ఇక గుర్తుతెలియని యాప్‌ల జోలికి వెళ్లరాదని, వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని కూడా సలహా ఇస్తున్నాయి. రివార్డు పాయింట్లతో ఉచ్చులోకి దించాలని చూసిన మోసగాళ్ల ఎత్తును కనిపెట్టి ఇటీవలే ఎస్బీఐ తమ ఖాతాదారులను అప్రమత్తం చేయడం గమనార్హం. మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో పని జరుగడం లేదనుకున్న కేటుగాళ్లు.. ఇప్పుడు యాప్‌ల ద్వారా ముందుకెళ్తున్నారు. ఏపీకే ఫైల్స్‌తో తెలియకుండానే మొబైల్ కస్టమర్లను ముంచేస్తున్నారు.
ఏపీకే మోసం అంటే?
ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే) ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్.. తమ యూజర్లు ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్‌నూ ఇన్స్టాల్ చేసుకొనేందుకు అనుమతిస్తుంది. ఈ వెసులుబాటే ఆండ్రాయిడ్ యూజర్లను హ్యాకర్లు దోపిడీ చేసేందుకు కలిసొస్తున్నది. ఏపీకే లేదా ట్రోజనైజింగ్ ద్వారా ఓ చట్టబద్దమైన యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. దీనిపై ఎస్బీఐ తమ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘ఎస్బీఐ రివార్డు పాయింట్లను రిడీమ్ (గెల్చుకోవడం లేదా పొందడం) కోసం వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా బ్యాంక్ ఖాతాదారులకు మోసగాళ్లు ఏపీకేలు పంపిస్తున్నారు. దయచేసి గుర్తుంచుకోండి ఎస్బీఐ ఎప్పుడూ ఏ లింకులు లేదా ఏపీకేలనూ వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా ఖాతాదారులకు పంపించదు. వాటిపై క్లిక్ చేయవద్దు. గుర్తుతెలియని ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దు’ అని పోస్ట్ చేసింది.
మోసపోతాం ఇలా..
1. బ్యాంక్ ఖాతాదారులు తమ స్మార్ట్ఫోన్లలో హానికరమైన ఏపీకేలను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ఉచ్చులో తొలుత చిక్కుకుంటారు. ఈ ఏపీకేలను ఇన్స్టాల్ చేసుకునేలా మోసగాళ్లు రకరకాల ఇంజినీరింగ్ వ్యూహాలనూ అమలు చేస్తూ ఉంటారు.
2. ఏపీకేపై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇది ప్రమాదం అంటూ ఎన్నో గుర్తుతెలియని సందేశాలు వెంటవెంటనే మొబైల్‌కు వస్తాయి. ఇందులో కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ తదితర అనుమతులు అవసరమని కూడా ఉంటుంది.
3. అన్ని అనుమతులూ ఇస్తూ మొబైల్ వినియోగదారులు ఏపీకేను ఇన్స్టాల్ చేసుకుంటే.. హ్యాకర్లు తమ హ్యాకింగ్ డివైజ్‌లపై సదరు మొబైల్‌ఫోన్‌ను గుప్పిట్లోకి తీసుకుంటారు. ఆపై మీ విలువైన, రహస్య సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. క్షణాల్లో మీకు సంబంధించిన అన్ని ఖాతాల నుంచి నగదును మాయం చేసేస్తారు.
ఇవి గుర్తుంచుకోండి
- ఏపీకే ఫైల్ పరిమాణం కొద్ది కేబీల్లోనే ఉంటుంది. కాబట్టి స్టోరేజీలో ఇది పెద్దగా స్పేస్‌ను తీసుకోదు. దీంతో ఇలాంటి ఒక ఫైల్ మన మొబైల్‌లోకి వచ్చినట్టే మనం గుర్తించలేకపోతాం. అంతేగాక ఇది పైకి కూడా కనిపించదు.
- మీ మొబైల్స్‌లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యుంటే మాత్రం ఈ ఏపీకే ఫైల్స్ హానికరమైనవని వెంటనే మీరు తెలుసుకోగలరు. అప్పుడు తక్షణమే సదరు ఫైల్స్‌ను డిలేట్ చేయండి.
- గూగుల్ ప్లే స్టోర్ సూచనలను తప్పక పాటించాలి. డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి హెచ్చరికలు వచ్చినా ముందుకు వెళ్లకపోవడమే మంచిది.
- మొబైల్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు రీబూట్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను డిలేట్ చేయాలి. అప్పుడే హ్యాకర్స్‌కు మీ ఫోన్‌తో ఉన్న కనెక్షన్ తెగిపోతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

