Gold Loans in Banks | భారతీయులకు బంగారం అంటే అపరిమితమైన ప్రేమ. కష్టకాలంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆదుకునేది కూడా పుత్తడే. నగదు కొరత సమస్య ఉన్నప్పుడు, కష్టాల నుంచి బయటపడేందుకు బంగారం మీద రుణం కూడా తీసుకోవచ్చు. బంగారం తనఖా పెట్టుకుని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) రుణాలిస్తాయి. గోల్డ్ జ్యువెల్లరీ, ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవచ్చు. బంగారాన్ని పూచీకత్తుగా పెట్టుకుని రుణ దాత లోన్ ఇస్తారు. ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడానికి బదులు బంగారంపై రుణం తీసుకోవడం మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకే బ్యాంకులు వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి.
దేశంలోని వివిధ బ్యాంకులు మంజూరు చేసే బంగారం రుణాలు.. దానిపై వడ్డీరేట్లు ఇలా
బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ — — —- బంగారం రుణంపై వడ్డీ —- ప్రాసెసింగ్ ఫీజు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర — — —— 7.00% —- —- —- రూ.500 నుంచి రూ. 2000 + జీఎస్టీ.
ఎస్బీఐ — — —- — — — — — 7.00% – 7.50% —- 0.50% + జీఎస్టీ
పంజాబ్ & సింద్ బ్యాంక్ — — —- 7.00% – 7.50% —- రూ. 500 నుంచి రూ.10వేలు
యూనియన్ బ్యాంక్ — — —- — 7.25% నుంచి 8.25%
కెనరాబ్యాంక్ —— —— ——– 7.35% —— —— రూ. 500 నుంచి రూ. 5000
ఇండియన్ బ్యాంక్ —— —— — 7.50% – 8% —— మంజూరైన రుణంపై 0.56%
బంగారంపై తీసుకున్న రుణం చెల్లించలేదనుకోండి. నెలసరి వాయిదా ప్రకారం రుణ గ్రహీతకు బ్యాంకులు ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపుతుంటాయి. నెలసరి వాయిదా టైం దాటితే వడ్డీరేట్లు, అదనపు చార్జీలు వసూలు చేస్తాయి. పదేపదే రిమైండర్లు పంపినా నిర్దిష్ట గడువులోగా రుణ వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు యాజమాన్యాలు సదరు బంగారం ఆభరణాలను వేలం వేసి, తమ సొమ్ము రికవరీ చేసుకుంటాయి.
బంగారంపై ఎంత రుణం ఇవ్వాలన్న విషయమై ఆయా బ్యాంకుల యాజమాన్యాలు, ఆభరణాలు, బంగారాన్ని బట్టి నిర్ణయిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకులో కనిష్ఠంగా రూ. 10 వేల నుంచి రూ. కోటి వరకు, ఎస్బీఐలో రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందొచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ రూ.1500 నుంచి ఎంత వరకైనా రుణాలిస్తుంది. బంగారంపై విలువలో 75 శాతం నుంచి 90 శాతానికి రుణాలు మంజూరు చేయాలని 2020 ఆగస్టులో రెగ్యులేటరీ ఆదేశాలు జారీ చేసింది.
బంగారంపై రుణాలు రెండు రకాలుగా తీసుకోవచ్చు. నెలవారీ వాయిదా చెల్లింపు ప్లాన్‌తో గానీ, బుల్లెట్ పేమెంట్ షెడ్యూల్‌తో గానీ చెల్లించొచ్చు. రుణ గడువు ముగిసే లోపు పూర్తి రుణం చెల్లించే ఆప్షన్ మీకు ఉంటుంది. సాధారణంగా బంగారం రుణాలను గడువు లోపే ముందస్తు క్లోజ్ చేయొచ్చు. అయితే ప్రీ-క్లోజర్ ఫీజు ఫే చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాంకు, ఎన్బీఎఫ్సీ మధ్య రకరకాలుగా ఉంటుంది.
ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఆరు నెలల్లో ముందస్తు రుణం క్లోజ్ చేసుకుంటే 2% ప్లస్ జీఎస్టీ విధిస్తారు. ఆరు నెలల తర్వాతై ఏ టాక్స్, ఫీజు ఉండదు. వివిధ బ్యాంకుల్లో బంగారం రుణాలపై గడువులు వేర్వేరుగా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీలో మూడు నెలల నుంచి రెండేండ్ల వరకు రుణ వాయిదాలు ఎంచుకోవచ్చు. ఇక ఎస్బీఐలో గరిష్ఠంగా మూడేండ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. ఇక ముత్తూట్ ఫైనాన్స్‌లో రుణ ప్రణాళికను బట్టి, రీపేమెంట్ గడువు, విధి విధానాలను బట్టి రకరకాల ఆఫర్లు అందిస్తున్నది.
రుణ గ్రహీత తాకట్టు పెట్టే బంగారాన్ని బట్టి. రుణం ఇచ్చే సంస్థను బట్టి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.1.5 లక్షల వరకు రూ.250, రూ.1.5 లక్షలు దాటితే రూ.500 ప్రాసెసింగ్ విధిస్తారు. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతోపాటు వాల్యుయేషన్ ఫీజు కూడా వసూలు చేస్తాయి. కనుక మీరు బంగారంపై రుణం తీసుకోవాలనుకుంటే ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థల్లో వడ్డించే ఫీజులు, చార్జీల గురించి తెలుసుకోవాలి.
ఎన్బీఎఫ్సీ లేదా బ్యాంకులో బంగారంపై రుణం పొందాలంటే మీరు పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ గుర్తింపు కార్డు అంటే పాన్ కార్డ్ లేదా ఆధార్, నివాస చిరునామా (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ తదితరాలు) సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఒక ఫొటోగ్రాఫ్ ఇవ్వాలి. బ్యాంకులను బట్టి అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది.