Flipkart-Axis Bank | ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్‌తో కలిసి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు ‘సూపర్ ఎలైట్’అనే పేరుతో కొత్త క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది. ఈ క్రెడిట్ కార్డు వాడకంతో ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ రివార్డు ప్రోగ్రామ్ మెరుగుపడటంతోపాటు కస్టమర్లకు బెస్ట్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్.. ఫ్లిప్ కార్ట్-యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉన్నది. ఇటీవలే ఈ ఫ్లిప్ కార్ట్-యాక్సిస్ క్రెడిట్ కార్డ్ 30 లక్షల యూజర్ల మైలురాయిని చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించడానికి ప్రత్యేక రివార్డులు అందించడానికి మరో కార్డు తీసుకొచ్చాయి.
కార్డు యాక్టివేషన్ మీద 500 సూపర్ కాయిన్స్ రివార్డులు వస్తాయి. రెండు నెలల పాటు యూ-ట్యూబ్ ప్రీమియం ట్రయల్ మెంబర్ షిప్ పొందొచ్చు. మూడు నెలల గానా ట్రయల్ సభ్యత్వం తీసుకోవచ్చు. ఏడాది పాటు లెన్స్ కార్ట్ గోల్డ్‌లో సభ్యత్వం లభిస్తుంది.
మింత్రాలో ఎంచుకున్న స్టయిల్స్ మీద అదనంగా రూ.500 వరకు తగ్గిస్తారు. రూ.2999 మించి చేసిన కొనుగోళ్లకు గానీ, గరిష్టంగా మూడు లావాదేవీలకు గానీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ ద్వారా దేశీయంగా విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటే 15 శాతం డిస్కౌంట్.. గరిష్టంగా రూ.1500 వరకు పొందొచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ కస్టమర్లు ప్రతి రూ.100 ఖర్చు మీద 16 సూపర్ కాయిన్లు పొందొచ్చు. ఒక ట్రాన్సాక్షన్ మీద గరిష్టంగా 300 కాయిన్లు మాత్రమే పొందొచ్చు. సాధారణ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు ప్రతి రూ.100 వినియోగంపై 8 సూపర్ కాయిన్లు పొందుతారు. గరిష్టంగా ఒక లావాదేవీపై 150 సూపర్ కాయిన్లు మాత్రమే లభిస్తాయి. ఇతర వేదికలపై చేసే ప్రతి ఖర్చు మీద రెండు సూపర్ కాయిన్లు పొందొచ్చు.
ఫ్లిప్ కార్ట్-యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డుతో ఎక్కడ షాపింగ్ చేసినా సూపర్ కాయిన్ రివార్డులు లభిస్తాయి. యూజర్ పొందే కాయిన్లు.. ఫ్లిప్ కార్ట్ యాప్ సూపర్ కాయిన్ బ్యాలెన్స్‌లో జత కలుస్తాయి. ఫ్లిప్ కార్ట్ యాప్‌ను ఉపయోగించుకుని చేసే కొనుగోళ్లపై ధర తగ్గింపుతోపాటు ఇతర బెనిఫిట్లు పొందొచ్చు.