Axis to Takeover Citi India | సిటీ బ్యాంక్ ఇండియా కన్జూమర్ బిజినెస్‌ను దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేయనున్నదా.. ఈ నెలలో 150 కోట్ల డాలర్ల విలువ గల డీల్‌కు యాక్సిస్ బ్యాంక్‌కు సిటీ బ్యాంక్ ఇండియా బిజినెస్ హస్తగతం కానున్నదా.. అంటే ఆయా బ్యాంకుల సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. సిటీ బ్యాంక్ ఇండియా టేకోవర్ కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇప్పటికీ రేస్‌లోనే ఉందని సమాచారం. అయితే, యాక్సిస్ బ్యాంక్ కంటే తక్కువ బిడ్ కోట్ చేసినట్లు తెలిసింది. దీంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ రెండో స్థానంలో ఉందని వినికిడి. దీనిపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా కొటక్ మహీంద్రా బ్యాంక్ వర్గాలు నిరాకరించాయి. సిటీ బ్యాంక్ మాత్రం తమ ఇండియా కన్జూమర్ బిజినెస్ విక్రయ ప్రక్రియ తమ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ముందుకు సాగుతుందని ఈ-మెయిల్ సమాధానంలో తెలిపింది.
వాల్ స్ట్రీట్ జెయింట్ సిటీ బ్యాంక్ గతేడాది భారత్‌తోపాటు 13 దేశాల్లో కన్జూమర్ ఫ్రాంచైసీల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. మున్ముందు మరింత ఆకర్షణీయ సంస్థాగత, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్‌లపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నది. రిటైల్ బ్యాంకింగ్, హోంలోన్లు, క్రెడిట్ కార్డులతో ఇండియన్ కన్జూమర్ బ్యాంకింగ్ లావాదేవీలను సిటీ బ్యాంక్ నిర్వహిస్తున్నది.
సిటీ బ్యాంక్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో దేశంలోనే మూడో ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ హై ఎండ్ క్రెడిట్ కార్డు, మార్టగేజ్ బిజినెస్ బలోపేతం అవుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. సిటీ ఇండియా రిటైల్ బిజినెస్ స్వాధీనంతో మరిన్ని అవకాశాల కల్పనకు, యాక్సిస్ బ్యాంక్ సేవల విస్తరణకు మార్గం సుగమం అవుతుందని తెలిపింది.
భారత్‌లో ఇండియన్స్‌కు క్రెడిట్ కార్డులను తొలుత పరిచయం చేసిన బ్యాంక్ సిటీ బ్యాంక్. తొలుత 1987లో దేశంలోకి క్రెడిట్ కార్డులకు తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత నవంబర్ నాటికి సిటీ బ్యాంక్ ఖాతాలో 2.57 మిలియన్ల క్రెడిట్ కార్డు కస్టమర్లు ఉన్నారు. యాక్సిస్ బ్యాంకు 7.9 మిలియన్ల క్రెడిట్ కార్డు దారులు ఉన్నారు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు ఎక్కువగా ఉన్నా.. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. 2021లో భారత్‌లో సిటీ బ్యాంక్ రిటైల్ రుణాలు రూ.21,600 కోట్లు (2.91 బిలియన్ల డాలర్లు) అని గత నెలలో సిస్టమాటిక్స్ ఇన్స్ట్యూషనల్ ఈక్విటీస్ నివేదించింది.