వార్షిక సభ్యత్వం రూ.1,499, నెలసరి రూ.179
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ల ఫీజుల్ని సంస్థ భారీగా పెంచింది. ఇండియాలో ఆఫర్‌చేసే ప్రైమ్ ప్రొగ్రామ్లకు వార్షిక సభ్యత్వ ఫీజును రూ.999 నుంచి 50 శాతం పెంచడంతో ఇక నుంచి రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ సభ్యత్వ ఫీజు రూ.129 నుంచి రూ.179గా అమెజాన్ నిర్ణయించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కలిగినవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంటెంట్‌ను వీక్షించే అవకాశంతో పాటు సంస్థ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొనుగోలుచేసే ఐటెమ్స్‌ను ఒకరోజులోనే డెలివరీ అందుకునే సౌలభ్యం ఉంటుంది. మూడు నెలల ప్లాన్‌ను రూ.329 నుంచి రూ.459కు పెంచారు. పెంచిన ఫీజు త్వరలోనే అమల్లోకి వస్తుందని, తేదీని తదుపరి ప్రకటిస్తామని అమెజాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రైమ్ మెంబర్లకు లక్షలాది ఐటెమ్స్‌పై ఒన్ డే డెలివరీ సదుపాయం ఉందని, ప్రైమ్ వీడియోలో సినిమాలు, టీవీ షోలు, 10 భాషల్లో అమెజాన్ ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. అలాగే అమెజాన్ మ్యూజిక్ ద్వారా ప్రకటనలేవీ లేకుండా 7 కోట్ల పాటలు వినవచ్చని, ప్రైమ్ రీడింగ్‌తో వేలాది పుస్తకాల్ని ఎంపికచేసుకోవొచ్చన్నారు. సేల్స్ ఈవెంట్స్, కొత్త ఉత్పత్తుల విడుదల, మెరుపు డీల్స్ వంటి సందర్భాల్లో ప్రైమ్ సభ్యులకు అమెజాన్ ప్రాధాన్యత ఇస్తున్నది.