లండన్, జూన్ 17: పాత ఐఫోన్ మోడల్స్‌ను యాపిల్ రహస్యంగా స్లో చేస్తున్నదని, అందుకు 91.8 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,200 కోట్లు) నష్టపరిహారాన్ని కోరుతూ బ్రిటన్ కోర్టులో దావా పడింది. వినియోగదారు హక్కుల ప్రచారకర్త జస్టిన్ గట్మాన్ కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్‌లో శుక్రవారం ఈ కేసును ఫైల్ చేశారు. హ్యాండ్సెట్ పనితీరును మెరుగుపర్చేందుకు అప్గేడ్స్ను ఇన్స్టాల్ చేసుకొమ్మని యాపిల్ సూచిస్తున్నదని, యూజర్లు వాటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాత ఐఫోన్లు స్లో అయిపోయేలా కంపెనీ చేస్తున్నదని గట్మాన్ ఆరోపించారు.
అప్డేట్ చేస్తే డివైస్ స్లో అవుతుందంటూ యాజర్లకు యాపిల్ తెలియచేయడం లేదన్నారు. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ కారణంగా పాత ఐఫోన్ బ్యాటరీలు సామర్థ్యం కోల్పోవడాన్ని కప్పిపుచ్చేందుకు ఈ అప్డేట్స్ను యాపిల్ ప్రవేశపెట్టిందన్నారు. దీంతో నష్టపోతున్న 2.5 కోట్లమంది ఐఫోన్ యూజర్లకు 91.8 కోట్ల డాలర్ల పరిహారాన్ని కోరుతూ ట్రిబ్యునల్‌లో గట్మాన్ ఈ దావా వేశారు. ఐ ఫోన్6, 6 ప్లస్, 6ఎస్, 6ఎస్‌ప్లస్, ఎస్ఈ, 7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్స్ యాజర్లకు ఈ పరిహారాన్ని డిమాండ్ చేశారు.