శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 23:42:05

కేటీపీఎస్‌కు చేరిన టర్బయిన్‌ వాల్వ్‌

కేటీపీఎస్‌కు చేరిన టర్బయిన్‌ వాల్వ్‌

పాల్వంచ: కేటీపీఎస్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ఏడో దశ కర్మాగారానికి సంబంధించిన టర్బయిన్‌ మెయిన్‌ పరికరమైన వాల్వ్‌ను సోమవారం రాత్రి 7 గంటలకు పాల్వంచకు చేర్చారు. 3 నెలల క్రితం టర్బయిన్‌ మరమ్మతులకు గురై విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం విదితమే. ఈ కర్మాగార నిర్మాణ బాధ్యతలను చేపట్టిన బీహెచ్‌ఈఎల్‌ ఇంజినీర్లు దాన్ని ఆ సంస్థ ప్రధాన కర్మాగారమైన హరిద్వార్‌కు తీసుకెళ్లారు. మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం మళ్లీ కేటీపీఎస్‌ ఏడో దశుకు చేర్చి యూనిట్‌లో అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటుగా టర్బయిన్‌కు సంబంధించిన వాల్వ్‌ కూడా మరమ్మతులకు గురికావడంతో దాన్ని కూడా రిపేరు చేసి రోడ్డు మార్గం ద్వారా కేటీపీఎస్‌ ఏడో దశకు చేర్చారు. ఈ నెల 4న హరిద్వార్‌లో బయలుదేరిన ఈ యంత్రం రోడ్డు మార్గం గుండా ఇక్కడకు చేరుకుంది. దీన్ని టర్బయిన్‌ అంతర్‌ భాగాల్లో అమర్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. దీన్ని అమర్చిన తర్వాత బాయిలర్‌ స్టీమ్‌కు సంబంధించిన ఇన్‌స్టాలేషన్‌ చేసి యూనిట్‌లో ఉత్పత్తి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీ కల్లా అన్ని పనులు పూర్తి చేయాలని టీఎస్‌ జెన్కో ఉన్నతాధికారులు బీహెచ్‌ఈఎల్‌, జెన్కో ఇంజినీర్లను ఆదేశించారు.