అమరావతి : వన్డే వరల్డ్ కప్( Oneday World Cup) కైవసంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి(Cricketer Sricharani) ఏపీ వాసులు ఘన స్వాగతం పలికారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి వరల్డ్ కప్ సాధించిన తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడ ( Vijayawada) కు వచ్చిన సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు అనిత, సవిత , పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఇండియా మాజీ కెప్టెన్ మిథాలిరాజ్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. నివాసం వద్ద ఏపీ మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలిచినందుకు శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీచరణికి ఏపీ సర్కార్ రూ. 2.5 కోట్ల నగదును, గ్రూప్ వన్ ఉద్యోగం, కడపలో భూమి ఇస్తామని ప్రకటించింది.
శ్రీచరణి మాట్లాడుతూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందానని గుర్తు చేశారు. కప్ గెలవడం మొదటి అడుగు మాత్రమేనని.. ఇంకా ముందు చాలా ఉందని అన్నారు. కప్ గెలిచిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ భారత జట్టులోని ప్రతి సభ్యురాలని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జట్టు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారని తెలిపారు.