Vangalapudi Anitha | వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణపై ఎస్పీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. పోలీసు అంటే భయం కాదు.. భద్రత అనే భరోసా రావాలవని అన్నారు. పోలీసులకు వీక్ ఆఫ్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సరెండర్ సెలవులు కూడా ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో సరెండర్ లీవులకు నిధులిస్తామని స్పష్టం చేశారు.
పోలీసు విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవని.. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉందని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఈ ఐదు జిల్లాల్లో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టమని చెప్పారు. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో అధునాత పరికరాలు, వాహనాల నిర్వహణ సరిగ్గా లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చివరికి పోలీసుల భద్రత కోసం పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పోలీసు అకాడమీ లేని రాష్ట్ర ఏపీనే అని చెప్పారు. పోలీసు వ్యవస్థ మళ్లీ పటిష్టంగా పనిచేయాలని సూచించారు.
సోషల్మీడియాలో కొంతమంది హోంశాఖపై, వ్యక్తిగతంగా తనపై బురద జల్లుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖ పనితీరు మీద, వైసీపీ ప్రభుత్వ విఫల విధానాలపై త్వరలోనే పూర్తి సమాచారంతో మీడియా సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పోలీసులకు సంక్షేమంపై దృష్టి పెట్టామని తెలిపారు.