Dastagiri | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. ఆమె శనివారం రాత్రి పులి వెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్యాలలో బంధువుల ఇంటికెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్న ఇద్దరు మహిళలు ఉద్దేశ పూర్వకంగా ఆ ఇంట్లో చొరబడి తనపై పథకం ప్రకారం దాడి చేశారని షాబానా ఆరోపించారు. ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ సంగతి తెలుసుకుని అక్కడికి చేరుకున్న దస్తగిరిపైనా సదరు మహిళలు దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ‘జగన్, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడతారా?’ అంటూ విచక్షణా రహితంగా కొట్టారని ఆమె తెలిపారు.
‘మల్యాల గ్రామ వాసులు శంషున్, పర్వీన్‌ను ఎవరు పంపితే నాపై దాడి చేశారో పోలీసులే తేల్చాలి. రంగన్న చనిపోయాక నా భర్తనూ చంపాలని చూస్తున్నారు. ఇద్దరు మహిళలూ పదేపదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారు. శనివారం సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటి వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు’ అని షాబానా ఆవేదన వ్యక్తం చేశారు.