అమరావతి : వైసీపీ పార్టీలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి అనేకసార్లు అవమానాలు జరిగాయని టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( MLA Kotamreddy Sridhar Reddy ) వెల్లడించారు. మొత్తం 72 సార్లు పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నారని, ప్లీనరీ సమావేశాల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala ) విజయసాయి ( Vijaya Sai ) ని కొట్టింది వాస్తవమేనని పేర్కొన్నారు. వేదికపై ఎవరితో మాట్లాడించాలనే విషయంపై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తి, మాటామాటా పెరిగి చేయిచేసుకున్నారని ఆరోపించారు.
మంగళవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయి సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు, కాకుపల్లి సెంటర్లో విజయసాయిని సజ్జల దారుణంగా దూషించారని తెలిపారు. అయితే విజయసాయిపై తనకు మంచి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఓ చరిత్ర అయితే, వైసీపీ ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేకుండా, వైసీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తోందని విరుచుకుపడ్డారు.