అమరావతి : వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి(AP Minister ) మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Ramprasad Reddy) మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
విజయవాడ వాసులు 12 రోజులుగా వరదలో (Vijayawada Floods) భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీస్తే వారిని పరామర్శించకుండా జైలు(Jail) లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను పరామర్శించడం సిగ్గుచేటని అన్నారు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్‌కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ నిలదీశారు.
వరద బాధితులను కనీసం 20 నిమిషాలపాటు కూడా పలకించ లేదని, జైలులో ఉన్న వ్యక్తి కోసం బెంగళూరు నుంచి గుంటూరు జైలుకు వచ్చి సమయం కెటాయించడం శోచనీయమన్నారు. జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో కడప జిల్లా పించా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి వంద మంది వరకు చనిపోతే ఇప్పటివరకు జగన్‌ను ఒక్క పైసా అందించలేదని ఆరోపించారు.
విజయవాడకు వంద సంవత్సరాల తరువాత భారీ వర్షాలు పడి వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు 12 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండి బాధితులకు అండగా నిలిచారని ప్రశంసించారు. అధికారులందరిని మోహరించి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.