Srisailam | కార్తీక మాసోత్సవం నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీక మాసం ఆఖరి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీప దానాలు చేస్తున్నారు. అలాగే కార్తీక దీపాలను వెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధిలో, గంగాధర మండపం వద్ద దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి భక్తునికి లడ్డూ ప్రసాదాలు అందేలా విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. విద్యుద్దీప కాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మికంగా ఆనంద పరవశులవుతున్నారు.
శ్రీశైలానికి వచ్చి వెళ్లే యాత్రికులు సాక్షి గణపతి ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి ఆలయ దర్శనానికి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. యాత్రికులు తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ దివాకర్‌రెడ్డి కోరారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి ప్రత్యేక పుప్పాలంకరణతో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. కార్తీక మాసంలో పుష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరిపించామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా చేసే దశవిధ హారతులను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ తెలంగాణ నుంచి భక్తులు క్షేత్రానికి వస్తున్నారని శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
1. ఓంకార హారతి: పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హరతిని దర్శించడంతో కష్టాలన్నీ నివారించబడి సకలు శుభాలు కలుగుతాయి.
2. నాగ హారతి: నాగ హారతిని దర్శించడం వల్ల సర్పదోషాలు తొలిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
3. త్రిశూల హారతి : త్రిశూల హారతిని దర్శించడం వల్ల అకాల మరణాలు తొలిగి గ్రహ దోషాలు నివారించబడుతాయి.
4. నంది హారతి: నంది హారతిని దర్శించడం వల్ల భయం దుఖం తొలిగిపోయి ఆనందం, నూతన ఉత్సాహం లభిస్తాయి.
5. సింహ హారతి: సింహ హారతిని దర్శించడం వల్ల శత్రు భాదలు తొలిగి మనో ధైర్యం పెరుగుతుంది.
6. సూర్య హారతి: సూర్య హారతిని దర్శించడం వల్ల ఆరోగ్యం చేకూరి దీర్ఘాయుస్సు లభిస్తుంది.
7. చంద్ర హారతి: చంద్ర హరతిని దర్శించడం వల్ల మనశ్సుద్ది కలిగి ఈర్ష్య, అసూయ ,ద్వేషాలు తొలిగిపోతాయి.
8. కుంభ హారతి: కుంభ హారతిని దర్శించడం వల్ల కోరుకున్న కోర్కెలు నెరవేరి సంపదలు కలుగుతాయి.
9. నక్షత్ర హారతి: నక్షత్ర హారతిని దర్శించడం వల్ల జాతక దోషాలు తొలిగి చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూర హారతి: కర్పూర హారతిని దర్శించడం వల్ల పాపాలన్నీ తొలిగి యఙ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.