అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో అధికారులు సౌకర్యాల లేమితో థియేటర్లను సీజ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో థియేటర్లను పరిశీలించారు. ప్రభుత్వ జీవో ప్రకారం థియేటర్లలో సౌకర్యాలపై ఆరా తీశారు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని మూడు సినిమా హాళ్లను మూసివేశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్డీవో శ్రీనుకుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఇప్పటికే పట్టణంలోని తొమ్మిది సినిమా థియేటర్లను తనిఖీ చేసిన అధికారులు శుక్రవారం ఏలూరు రోడ్డులో బొమ్మరిల్లు మినీ థియేటర్ను తనిఖీ చేసి సౌకర్యాలు లేవంటూ సీజ్ చేశారు. ఇదిలా ఉండగా అధికారుల దాడులతో బెంబేలెత్తుతున్న యజమానులు ముందు జాగ్రత్తగా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేసుకుంటుండగా మరి కొందరు సౌకర్యాల కల్పనపై దృష్టిని సారించారు.