Nagababu | వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా శవరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాలేదు.. అప్పుడే విమర్శలేంటి? అని మండిపడ్డారు.
ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని.. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపైనా నాగబాబు సెటైర్లు వేశారు. అసెంబ్లీకి రావడానికి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశామని నాగబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా హింస అనుభవించారని తెలిపారు. అప్పుడు చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోగానే రాష్ట్రం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా తమకు వైసీపీపై ద్వేషం లేదని తెలిపారు. కేంద్రం నుంచి తమకు పూర్తి సహకారం ఉందని.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామన్నారు. ఆరు నెలల సమయమిస్తే అన్నీ చేస్తుందన్నారు.