విశాఖపట్నం: కొవిడ్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండటంతో.. పర్యాటక రంగం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నది. వేసవి సెలవులు కూడా తోడవడంతో విశాఖ బీచ్‌లు, బొర్రా గుహలు, అరకు లోయ వంటి టూరిజం ప్రాంతాల్లో జనం కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు మామూలు స్థితికి రావడంతో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో ప్యాసింజర్ పడవలు నడవడం కూడా మొదలయ్యాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండేండ్లపాటు కార్యకలాపాలను నిలిపివేసి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ప్యాసింజర్ కార్గో షిప్‌లను నడపడం తిరిగి ప్రారంభించింది.
శనివారం సాయంత్రం పోర్ట్ బ్లెయిర్ నుంచి 450 మంది ప్రయాణికులతో ఎంవీ కాంప్‌బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ విశాఖకు బయలుదేరింది. 95 శాతం మంది ప్రయాణికులు ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఈ నౌకలో ఉన్నారు. ఈ నౌక మే 3వ తేదీ ఉదయం విశాఖపట్నం పోర్టులో లంగరు వేయనున్నది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. వీరంతా అండమాన్, నికోబార్ దీవులలోని వివిధ ప్రాంతాలలో పని చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. సముద్ర మార్గం తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో వలస కార్మికులు ఎక్కువగా ఓడల ద్వారా ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు.
విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు ఎంవీ క్యాంప్‌బెల్ బే తిరుగు ప్రయాణం ఇప్పటికే ఖరారైందని, క్యాంప్‌బెల్ బే షిప్ విశాఖపట్నం నుంచి మే 5వ తేదీ సాయంత్రం బయలుదేరుతుందని ఫెర్రీ ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ తెలిపారు. షిప్పింగ్ సేవలు పునఃప్రారంభించినందున, విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లెయిర్ తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు ఊహించిన దానికంటే త్వరగా అమ్ముడయ్యాయి. 500 సీట్ల ఎంవీ క్యాంప్‌బెల్ బే టిక్కెట్లు బుకింగ్ విండోలో కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయని ఆ అధికారి పేర్కొన్నారు.