విజయవాడ: విధులకు వచ్చిన కానిస్టేబుల్ బైక్ మాయమైంది. అది కూడా పోలీస్ స్టేషన్ ముందే పార్కింగ్ చేసింది కావడం విశేషం. సదరు బైక్ దొంగ గుంటూరు వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు గుర్తించి.. ఆ మాయగాడ్ని పట్టుకునేందుకు పరుగులంకించుకున్నారు. ఈ కిలాడి దొంగ తీరును చూసి విజయవాడ జనం వామ్మో..! అంటూ నోరు తెరుస్తున్నారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వెంకటేశ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే సోమవారం కూడా విధులకు వచ్చిన వెంకటేశ్.. తన బైక్‌ను పీఎస్ గేట్ వద్ద పార్కింగ్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చూడగా తన బైక్ కనిపించలేదు. ఎవరో తీసుకెళ్లి ఉంటారని సీసీ కెమెరాలను పరిశీలించాడు. బైక్ పార్కింగ్ చేసిన కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి కుంటుకుంటూ వచ్చి మారు తాళంచెవితో బైక్‌ను స్టార్ట్ చేసి ఎంచక్కా ఎత్తుకుపోవడం కనిపించింది. దాంతో కంగుతిన్న వెంకటేశ్.. మిగతా పీఎస్‌లలో అలర్ట్ చేశాడు. కాగా, సదరు దొంగ కొట్టేసిన బైక్‌పై గుంటూరు వైపు వెళ్తుండగా గుర్తించారు.
వెంటనే అలర్టైన కానిస్టేబుల్ వెంకటేశ్ సహచర ఉద్యోగిని వెంటపెట్టుకుని బయల్దేరాడా. బైక్‌పై వెళ్తూనే గుంటూరు అర్బన్ పోలీసులను వెంకటేశ్ అలర్ట్ చేశాడు. వెంటనే వారు మంగళగిరి జాతీయ రహదారిపై పెదకాకాని సమీపంలో బైక్‌పై దర్జాగా వస్తున్న దొంగను పట్టుకున్నారు. సదరు బైక్ దొంగను పాత నేరస్తుడు కంచికచర్ల అరుంధతీనగర్ కు చెందిన నండ్రు మాణిక్యాలరావుగా గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. బైక్ విడి భాగాలు గుంటూరులోని పాత సామాన్ల మార్కెట్లో తేలేవని విజయవాడవాసులు చర్చించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్కింగ్ చేసిన కానిస్టేబుల్ బైక్‌ను కొట్టేయాలనుకోవడం దొంగకు ఎందుకు అనిపించిందో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.