విజయవాడ: కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాకు ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉన్నదన్నారు. కడపకు ఆధ్మాత్మిక, చారిత్రాత్మక విశిష్టత ఉన్నదని, 1835 దశకంలో ఏర్పడిన కడప జిల్లా చారిత్రాత్మకంగా ఎంతో పేరు ఉన్నదన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి నిలయమైన తిరుమలకు తొలి గడపగా కడపను అందరూ భావిస్తారని తెలిపారు.
2009లో జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారని తులసి రెడ్డి చెప్పారు. కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన విశిష్ట సేవలకు కృషిగా ఆయన పేరు పెట్టడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరోసారి జిల్లాల పేర్లుమార్పు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో.. ఒకవైపు వైఎస్సార్‌ను గౌరవించుకుంటూనే మరోవైపు కడప విశిష్టత మరుగున పడిపోకుండా వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పిడి చేయాలని తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.