నమస్తే సార్! మా మిత్రులం ఐదుగురం కలిసి, ఇటీవలే 25 పాడిపశువులను కొనుగోలు చేశాం. పాలను డెయిరీలకు సరఫరా చేస్తున్నాం. పశువుల మేత కోసం మా వ్యవసాయ భూముల్లో గడ్డిని పెంచాలని అనుకుంటున్నాం. అయితే, మావి ఒక్కొక్కరివీ ఒక్కో రకమైన భూములు. ఏ నేలల్లో.. ఎలాంటి రకం పశుగ్రాసాన్ని పెంచాలో చెప్పగలరు.
-ఏ. రాజ్‌కుమార్, కొత్తపల్లి
పశుగ్రాస పంటలకు దాదాపు అన్ని రకాల నేలలూ అనుకూలంగా ఉంటాయి. అయితే, ప్రాంతాలను బట్టి, నీటి లభ్యతను బట్టి దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందుకే, కొన్ని రకాల నేలల్లో.. కొన్ని రకాల గడ్డిని మాత్రమే పెంచుకోవాలి.
ఆమ్ల నేలలు : ఈ రకం నేలల్లో మక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం), బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు, గినీగడ్డి (హమిల్ రకం) సాగు చేయవచ్చు.
చౌడు నేలలు : చౌడు భూముల్లో రోడ్స్ గడ్డి, సూడాన్ గడ్డి (ఎస్.ఎస్.జి – 59-3 రకం), ఓట్స్ (కెంట్, ఓ.యస్-6 రకాలు), బాజ్రా నేపియర్ హైబ్రిడ్ రకాలు,
సజ్జ (యన్.డి.ఎఫ్.డి-2 రకం), లూసర్న్ (టి-9 రకం), దశరథ గడ్డి (హెడ్జ్‌లూసర్న్), పారాగడ్డి అనుకూలంగా ఉంటాయి.
సున్నపు నేలలు : జొన్న (పి.సి – 6 రకం), సజ్జ (రాజ్కోబాజ్రా రకం), బాజ్రా నేపియర్ హైబ్రిడ్ రకాలు సున్నపు నేలల్లో మంచి దిగుబడిని ఇస్తాయి. బంజరు, పడావు భూముల్లో అంజన్ గడ్డి, స్టయిలో, నీరు నిలువ ఉండే నేలల్లో అయితే, పారాగడ్డి, బాజ్రానేపియర్ హైబ్రిడ్లు సాగు చేసుకోవచ్చు.